ప్రజల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై గౌరవం లేకపోవడం విచారకరం

ప్రజల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై గౌరవం లేకపోవడం విచారకరం

ట్రాఫిక్‌ నియమాలు పాటించేలా పౌరుల్లో మార్పు తీసుకురాకపోతే భారత్‌లో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలను తగ్గించేందుకు చేపట్టే ప్రయత్నాలేవీ విజయవంతం కావని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. భారత్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించే బాధ్యత కేంద్రంతో పాటు సామాన్యులపై సైతం ఉందని తెలిపారు. ప్రజల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై గౌరవం లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

అతివేగంగా, హెల్మెట్‌ వినియోగించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్‌, రాంగ్‌ రూట్‌లో వాహనాలు నడపడం భారత్‌లో చాలా రోడ్డు ప్రమాదాలకు కారణాలు. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ.. వాహనదారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఉల్లంఘిస్తున్నారని, చట్టంపై భయం, గౌరవం లేవని గడ్కరీ పేర్కొన్నారు. వాహనదారుల సహకారం లేకుండా ప్రమాదాల సంఖ్యను సమర్థవంతంగా తగ్గించడం కష్టమని పునరుద్ఘాటించారు. 

పౌరుల ప్రవర్తనలో మార్పు, చట్టంపై గౌరవం అవసరమని, రోడ్డు భద్రతకు సంబంధించిన విషయంలో మానవ ప్రవర్తనలో మార్పు ఓ ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు సెలబ్రెటిటీల సహాయం తీసుకుంటున్నామని తెలిపారు.  కేంద్రం లెక్కల ప్రకారం.. 2021లో భారత్‌లో 1.54లక్షల మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కనీసం 3.84 లక్షల మంది గాయపడ్డారు.

గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 1.31 లక్షలు. దేశంలో ఏటా దాదాపు 5లక్షల రోడ్డు ప్రమాదాలు, లక్షన్నర మరణాలు చోటు చేసుకుంటున్నారు. సాధారణంగా 18-34 ఏళ్లలోపు వారే ఎక్కువగా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి కాళ్లు, చేతులు పోగొట్టుకుంటున్నారు.

రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ చర్యలు చేపట్టిందని నితిన్‌ గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా రోడ్లపై బ్లాక్‌ స్పాట్‌లను తగ్గించేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సుమారు రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. మరణాలను తగ్గించేందుకు వాహన తయారీ కంపెనీలను సురక్షితమైన మోడల్స్‌ను ఉత్పత్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

తప్పనిసరి 6 ఎయిర్ బ్యాగ్‌లు, మెరుగైన రోడ్ ఇంజినీరింగ్‌తో సహా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మెరుగుదలలు అవసరమన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌, వ్యూహాత్మక ప్రదేశాల్లో అండర్‌పాస్‌లు అవసరమన్న కేంద్రమంత్రి 2024 నాటికి భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను 50శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారితే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేమని గడ్కరీ అభిప్రాయపడ్డారు.