 
                భారీ వర్షాలు, వరదల కారణంగా అస్సాం లో జన జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా సహాయ కేంద్రాలకు తరలించారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈ వరద బీభత్సం అధికంగా ఉంది. ఈ జిల్లాల్లోని సుమారు 5 లక్షల మందిపై ఈ వరదలు ప్రభావం చూపాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. 
ముందే, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని సహాయ కేంద్రాలకు తరలించింది. దాంతో,వరదల కారణంగా చోటు చేసుకున్న మరణాల సంఖ్య 2 కి మాత్రమే పరిమితమైంది. వరదల కారణంగా నల్బరి జిల్లాలో ఒకటి, తాముల్పూర్ జిల్లాలో మరొకటి మరణం సంభవించాయి. ఆ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 
అస్సాంతో పాటు పొరుగున ఉన్న భూటాన్ లో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పగ్లాడియే నదిలో నీటిమట్టం పెరిగి వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని బర్పేట, బజాలి, బక్సా, దిబ్రూఘడ్, నల్బరి, తముల్పూర్, కోక్రాఘడ్, లక్ష్మిపూర్, ధూబ్రీ తదితర 20 జిల్లాల్లో ఉన్న 1538 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. వాటిలో బజాలి, బర్పేట జిల్లాల్లో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. 
వరద ప్రభావ ప్రాంతాల్లో ప్రభుత్వం 225 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఆ శిబిరాలకు సుమారు 35 వేల మందిని తరలించింది. వరద ప్రభావ ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యావసరాలను అధికారులు అందిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా సుమారు 10 వేల హెక్టార్ల విస్తీర్ణంలోని పంటలు నీట మునిగాయి.
ఇళ్లు, వంతెనలు, పాఠశాల భవనాలు, ప్రభుత్వ భవనాలు ఈ వర్షాలు, వరదలతో ధ్వంసమయ్యాయి. అస్సాంలో ఈ ఆదివారం వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ను జారీ చేసింది. బ్రహ్మపుత్ర, మానస్, పుతిమరి, పగ్లాదియా వంటి నదులు ప్రమాదకర స్థాయిలను మించి ప్రవహిస్తున్నాయి. బరాక్ లోయను గువాహతితో కలిపే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.





More Stories
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు