అమెరికా- చైనా మధ్య రహస్య చర్చలు

అమెరికా- చైనా మధ్య రహస్య చర్చలు

ప్రధాని మోదీ అధికార పర్యటనకై అమెరికాకు బయలుదేరడానికి ముందే అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ చైనాలో రెండు రోజులపాటు పర్యటించడం,  చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్‌ను కూడా కలవడం, మోదీ విమానం ఎక్కడానికి ముందే బ్లింకెన్ వెనుతిరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంటుంది.

ఓ కార్యదర్శి స్థాయి వ్యక్తి అమెరికా నుండి చైనాలో పర్యటించడం ఐదేళ్ల తర్వాత జరిగింది. పైగా, వారి చర్చలు గోప్యంగా ఉంచడం, ఎటువంటి వివరాలు ప్రకటించక పోవడం గమనార్హం. ఈ దశలోనే ఇరుదేశాల మధ్య సర్దుబాట్లు కుదిరినట్లు చైనా నేత తెలియచేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఏఏ అంశాలపై అవగావహన కుదిరిందనేది తెలియచేయలేదు.

బ్లింకెన్‌తో చర్చలు అత్యంత రహస్యంగా , చాలా లోతుగా జరిగాయని అధికారులు వెల్లడించారు. తాను అమెరికా విదేశాంగ మంత్రితో భేటీ అయినట్లు, చైనా నేత రెండుదేశాల ఉన్నతస్థాయి దౌత్యవేత్తల నడుమ విస్తృతస్థాయి సంప్రదింపుల తరువాత కొన్ని నిర్థిష్ట అంశాలపై పరస్పర అవగాహన కుదిరిందని ఆ తర్వాత చైనా అధినేత తెలిపారు

ఇరు దేశాలు ఒకరికొకరు ముప్పుగా పరిగణించేకన్నా, ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను గుర్తించి, వాటికి విలువనిచ్చి, వారి రంగాల్లో విజయం సాధించడమనేది ఒక అవకాశమని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ప్రజల కోసం, ప్రపంచ దేశాల కోసం, ఇరు దేశాల మధ్య సంబంధాలు సక్రమంగా నిర్వహించడం కోసం బాధ్యతతో ఇరు దేశాలు వ్యవహరించాల్సి వుందని చెప్పారు.

అమెరికా ప్రయోజాలను చైనా గౌరవిస్తుందని, అమెరికాను సవాలు చేయాలని గానీ లేదా పక్కకు నెట్టాలని గానీ చైనా భావించదని స్పష్టం చేశారు. అలాగే అమెరికా కూడా చైనాను గౌరవించాలని సూచించారు. చైనా చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను దెబ్బతీయరాదని, ఏ ఒక్క పక్షమూ కూడా ఎదుటి పక్షాన్ని తనకిష్టం వచ్చినట్లు మార్చడానికి ప్రయత్నించరాదని స్పష్టం చేశారు.

ఆంటోనీ బ్లింకెన్‌ అంతకు ముందు చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌తో దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిపారు. అయితే చర్చల గురించి ఇరు పక్షాలు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ”వాస్తవికతతో కూడిన నిర్మాణాత్మక చర్చలు” గా బ్లింకెన్‌ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ అభివర్ణించారు.

ఈ చర్చల వివరాలను తెలియజేస్తూ చైనా క్లుప్తంగా ఒక ప్రకటనను విడుదల చేస్తూ ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రధానంగా తైవాన్‌పైనే చర్చ జరిగిందని పేర్కొంది. చైనా కీలక ప్రయోజనాలకు తైవాన్‌ అంశం కీలకమైనదని కిన్‌ గాంగ్‌ వ్యాఖ్యానించారు. చైనా-అమెరికా సంబంధాల్లో కూడా ఇదే అత్యంత కీలకాంశం, అత్యంత ముప్పు కలిగిన అంశం కూడా ఇదేనని కిన్‌, బ్లింకెన్‌కు తెలియజేసినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.

కాగా, బ్లింకెన్‌, కిన్‌ల మధ్య జరిగిన చర్చలు రెండు దేశాల మధ్య గల తీవ్రమైన విభేదాలను తేటతెల్లం చేశాయని చైనా విదేశాంగ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు విలేకర్లతో వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య విమానాల సంఖ్యను విస్తరించడానికి ఉభయులూ అంగీకరించారు.