పాక్ ఉగ్రవాదికి చైనా అండ.. మండిపడ్డ భారత్

లష్కర్‌-ఇ-తొయిబా ఉగ్రవాది సాజిద్‌ మీర్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను చైనా తిరస్కరించడాన్ని భారత్‌ ఖండించింది. అనేక సభ్య దేశాలు మద్దతు ప్రకటించినప్పటికీ ఆ ఉగ్రవాదిని బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలనే ప్రతిపాదన నెరవేరలేదని భారత్‌ పేర్కొంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐరాసలో ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు భారత్‌ ఓ సందేశాన్ని విడుదల చేసింది.

గ్లోబల్‌ కౌంటర్‌ టెర్రరిజం ఆర్కిటెక్చర్‌లో వాస్తవంగా ఏదో తప్పు జరిగిందని అంగీకరించడానికి తమకు న్యాయమైన కారణాలు ఉన్నాయని భారత్‌ పేర్కొంది. సంకుచిత  భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాదులను ఆమోదించకపోతే.. ఉగ్రవాద సవాళ్లపై చిత్తశుద్ధితో పోరాడే నిజమైన రాజకీయ సంకల్పం మనకు నిజంగా లేనట్లేనని భారత్‌ స్పష్టం చేసింది.  అలాగే ఐరాసలో భారత్‌ పలు ప్రశ్నలను సంధించింది.

జవాబుదారీతనం, పారదర్శకత కలిగిన ఈ సమయంలో మనం ఎటువంటి కారణం చెప్పకుండా బ్లాక్‌ లిస్ట్‌ జాబితా ప్రతిపాదనను అట్డుకోవచ్చా? అని ప్రశ్నించింది. అజ్ఞాత వాసి ముసుగులో ప్రతిపాదనలు సమర్పించడానికి తాము అనుమతించగలమా? అని నిలదీసింది.  1267 అల్‌ ఖైదా ఆంక్షల కమిటీ కింద సాజిద్‌ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలని, అలాగే అతని ఆస్తులను సీజ్‌ చేయాలని, ప్రయాణాలపై నిషేధం విధించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎష్‌సి)లో భారత్‌, అమెరికా సంయుక్తంగా ప్రతిపాదించాయి.

 సాజిద్‌ మీర్‌ ప్రతిపాదనపై గతేడాది సెప్టెంబర్‌లో చైనా తటస్థంగా ఉంది. ఇప్పుడు అడ్డుకున్నట్లు సమాచారం. 26/11 ముంబయి ఉగ్రదాడిలో సాజిద్‌ మీర్‌ పాత్ర ఉండటంతో భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదిగా ప్రకటించడంతో పాటు అతనిపై ఐదు మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఈ దాడిలో అతని పాత్ర ఉన్నట్లు గతేడాది ఐరాసలో భారత్‌ ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది.

నేడు మరోసారి ఆ ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది. గతేడాది జూన్‌లో పాకిస్తాన్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ కేసులో మీర్‌కు 15 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. అనంతరం సాజిత్‌ మీర్‌ మరణించాడని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే పలు దేశాలు మాత్రం అతని మృతిపై సాక్ష్యాలు సమర్పించాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాయి.