మమత సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

మమత సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల వేళ మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్‌లోని సున్నితమైన జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ సర్కార్ సవాలు చేయగా, ఆ సవాలు పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది.
 
బెంగాల్‌లో ఒకేరోజులో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరగాలన్నదే హైకోర్టు ఆదేశాల వాస్తవ ఉద్దేశమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. సవాలు పిటిషన్లను తోసిపుచ్చింది.
 
పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో హింసాకాండ చెలరేగడం, దీనిపై గవర్నర్‌ సీపీ ఆనంద బోస్‌కు, మమతాబెనర్జీకి మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.  బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కోసం కేంద్ర బలగాలను మోహరించడానికి అనుకూలంగా కోల్‌కతా హైకోర్టు ఈనెల 15న తీర్పునిచ్చింది.
 
ముఖ్యంగా రాష్ట్ర పోల్ ప్యానల్ గుర్తించిన సున్నితమైన ఏడు జిల్లాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలను తప్పనిసరిగా మోహరించాలని ఆదేశించింది. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసు బలగాలతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికలను మోహరించాలని, కోరాలని తాము భావిస్తున్నట్టు జస్టిస్ హిరణ్య్ భట్టాచార్యతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
 
జూన్ 13న తాము కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలిచ్చినా తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న అన్ని జిల్లాల్లోనూ కేంద్ర బలగాలను మోహరించాంటూ ఎస్ఈసీకి ఆదేశాలిచ్చింది. కాగా, చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే నామినేషన్న ప్రక్రియ జరిగిందని మమత సర్కార్ పేర్కొనడంతో పాటు, ఎస్‌ఈసీతో సమావేశానంతరం అనంతరం హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
 

హైకోర్టు అంతిమ ఉద్దేశం కూడా ఎన్నికలు స్వేచ్ఛగా, జరగడడమేనని సుప్రీంకోర్టు మంగళవారంనాడు విచారణ సందర్భంగా నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేస్తూ, పిటిషన్లను కొట్టివేసింది. జూలై 8న పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, గత వారం నామినేషన్ల సందర్భంగా పలు చోట్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుని సుమారు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.