
మణిపూర్‌లో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాకాండ పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు, ద్వేషానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణంలో పరస్పర చర్చలు, సౌభ్రాతృత్వాన్ని చాటుకోవడం ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు.
ఈ బాధాకరమైన హింసను తక్షణమే అరికట్టడానికి, శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలతో పాటు నిర్వాసితులకు సహాయ సామాగ్రి సజావుగా అందేలా చూడాలని స్థానిక పరిపాలన, పోలీసు, మిలిటరీ, కేంద్ర ఏజెన్సీలతో సహా ప్రభుత్వానికి సంఘ్ విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుత సంక్షోభానికి కారణమైన ఇరు వర్గాల మధ్య నెలకొన్న విశ్వాస లోపాన్ని అధిగమించాలని ప్రతి ఒక్కరినీ దత్తాత్రేయ హోసబలే విజ్ఞప్తి చేశారు. దీనికి రెండు వైపుల నుండి సమగ్ర కృషి అవసరం అని తెలిపారు. మెయిటీస్‌లోని అభద్రత, నిస్సహాయత; కుకీ సంఘం సమాజపు ఆందోళనలను ఏకకాలంలో పరిష్కరించడం ద్వారా దీనిని పరిష్కరించవచ్చని ఆయన సూచించారు.
మొత్తం పౌర సమాజం, మణిపూర్ రాజకీయ సమూహాలు, సాధారణ ప్రజలు ప్రస్తుత అస్తవ్యస్తమైన, హింసాత్మక పరిస్థితులను అంతం చేయడానికి, మణిపూర్ రాష్ట్రంలో మానవ జీవితానికి భద్రత,శాశ్వత శాంతిని నిర్ధారించడానికి సాధ్యమైనంత చొరవ తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేసింది.
మే 3న లై హరోబా పండుగ సందర్భంగా చురచంద్‌పూర్‌లో నిర్వహించిన నిరసన ర్యాలీ తర్వాత మణిపూర్‌లో మొదలైన హింస, అనిశ్చితిని ఆయన తీవ్రంగా ఖండించారు. శతాబ్దాలుగా పరస్పర సామరస్యం, సహకారంతో ప్రశాంత జీవనం సాగిస్తున్న వారిలో ఆ తర్వాత చెలరేగిన అశాంతి, హింసాకాండ ఇంకా ఆగకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 50,000 మందికన్నా ఎక్కువగా మణిపూర్ సంక్షోభంలో నిరాశ్రయులైన వ్యక్తులు, ఇతర బాధితులకు ఈ భయంకరమైన దుఃఖం సమయంలో అండగా నిలుస్తున్నట్లు ఆయన తెలిపారు.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్‌కు ఎంతో కీలకం