మధ్యధరా సముద్రంలో 500 మంది శరణార్ధులు మునక !

మధ్యధరా సముద్రంలో 500 మంది శరణార్ధులు మునక !

యుద్ధం, పర్యావరణ విపత్తు, దారిద్య్రం, అణచివేతల ముప్పు నుండి పారిపోయేందుకు ప్రయతిుంచిన 500మందికి పైగా వలసదారులు గ్రీస్‌కు వాయవ్యంగా మధ్యధరా సముద్ర జలాల్లో మునిగిపోయి మరణించారని అధికారులు తెలిపారు. వీరిలో కొంతమంది ఆచూకీ కూడా లభ్యం కాలేదు.  గత బుధవారం తెల్లవారు జామున వీరు ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడటంతో ఈ విషాదం సంభవించింది.

మరణించిన వారిలో 30నుండి వంద మంది చిన్నారులు ఉన్నారు. గ్రీస్‌కు వెళ్ళేందుకు ఈనెల 10న లిబియాలోని టోబ్రెక్‌ వద్ద చేపల బోటులోకి దాదాపు 750మంది ఎక్కారు. రోజుల తరబడి సాగే ప్రయాణానికి అవసరమైన ఆహారం, నీరు వంటివి ఏమీ లేకుండానే వీరు బయలుదేరి పోయారు. బోటు ఓపెన్‌ డెక్‌పైన వందలాదిమంది కిక్కిరిసి కూర్చున్నారు. ఈ మేరకు గ్రీస్‌ కోస్ట్‌ గార్డ్‌ అందచేసిన ఒక ఫోటో బయటకు వచ్చింది.

ఇప్పటివరకు కేవలం 78 మృత దేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. 104మందిని మాత్రమే కాపాడగలిగారు. మిగిలిన వారి ఆచూకీ గల్లంతైంది. వారి కోసం బుధవారం నుండి సాగిన గాలింపు చర్యలు శుక్రవారం రాత్రితో ముగిశాయి.

ఈ వలస విధానానికి బాధ్యులైన అధికారుల వైఖరిని ఖండిస్తూ గ్రీస్‌లో గురువారం పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. వారిని పోలీసులు బాష్పవాయు గోళాలతో చెల్లాచెదురు చేశారు. పార్లమెంట్‌ వెలుపల కమ్యూనిస్టు పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించగా, ప్రాప్‌లియా యూనివర్శిటీ వెలుపల కూడా నిరసనలు చేపట్టారు.

మృతులకు సంతాప సూచకంగా గ్రీస్ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఈ నెల 25న జరుగనున్న సాధారణ ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని నిలిపివేశాయి.

ఈ విషాదంలో గ్రీక్‌ ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించింది. సహాయక చర్యలు సత్వరమే చేపట్టేందుకు తిరస్కరించింది. దాంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో వున్నవారు సాయం కోసం అభ్యర్ధించకపోయినా సముద్ర జలాల చట్టం కింద వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సిన బాధ్యత వుందని ఓస్లో యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఎరిక్‌ రోసెగ్‌ వ్యాఖ్యానించారు.

సమగ్ర వలస, ఆశ్రయ విధానాన్ని తీసుకురావడంలో విఫలమైనందుకు యురోపియన్‌ యూనియన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా జరిగిన విషాదం స్థాయి భారీగా వుండడంతో గ్రీక్‌ ప్రభుత్వంపై, ఇయుపై ఒత్తిడి పెరిగింది. గ్రీక్‌ మాజీ ప్రధాని అలెక్సిస్‌ సిప్రాస్‌ ఇయు దేశాలపై తీవ్రంగా విమర్శలు చేశారు.