బాడ్మింటన్ ఓపెన్ టైటిల్ గెలిచిన భారత జోడీ

బాడ్మింటన్ ఓపెన్ టైటిల్ గెలిచిన భారత జోడీ
ఇండోనోషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పురుషుల జోడీ చరిత్ర సృష్టించింది. మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టిల జోడి ఘన విజయం సాధించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.  ప్రపంచ ఛాంపియన్స్‌ అయిన మలేషియాకు చెందిన ఆరోన్‌ చియా-సో వుయ్‌ జోడీని భారత జోడీ 21-17, 21-18 తేడాతో మట్టికరిపించింది.

ఇండోనేషియా బ్యాడ్మింటన్‌ ఓపెన్‌లో ఏ డబుల్స్‌ కాంబినేషన్‌లోనైనా భారత్‌ బంగారు పతకాన్ని గెలుచుకోవడం ఇదే తొలిసారి. గత కొంత కాలం నుంచి బీడబ్ల్యూఎఫ్‌ సర్క్యూట్‌లో నిలకడ కొనసాగిస్తున్న సాత్విక్‌ జోడీ  శనివారం జరిగిన సెమీస్‌ తొలి గేమ్‌లో పరాజయం పాలైనా తర్వాత పుంజుకుని విజయం సాధించారు.

ఇవాళ ఫైనల్‌లోనూ నెగ్గి భారత్‌కు బంగారు పతకం సాధించిపెట్టారు. ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్‌ అంటే.. సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ ఇలా సింగిల్స్‌ ప్లేయర్ల పేర్లే ఎక్కువ చర్చకు వచ్చేవి. కానీ ఇప్పుడు డబుల్స్‌లోనూ మనవాళ్లు దుమ్మురేపుతున్నారు.

సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి అంతర్జాతీయ సర్క్యూట్‌లో నిలకడైన విజయాలతో డబుల్స్‌లోనూ పతకాలు కొల్లగొట్టగలమనే భరోసా ఇస్తున్నారు. నిరుడు బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన ఈ జోడీ  ఇప్పుడు ఇండోనేషియా ఓపెన్‌ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.

ఇండోనేషియా ఓపెన్ 2023 పురుషుల డబుల్స్ సమ్మిట్‌లో ఆదివారం జరిగిన పోరులో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ్ వూయి యిక్‌లను ఓడించి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 1000 టోర్నమెంట్‌ను గెలుచుకున్న తొలి భారతీయ జంటగా సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి నిలిచారు. తొమ్మిదో మీటింగ్‌లో మలేషియా జంటపై ఇది వారికి మొదటి విజయం.
 
అయితే పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ప్రయాణం సెమీఫైనల్‌తోనే ముగిసింది. శనివారం జరిగిన డబుల్స్‌ సెమీస్‌లో ఏడో సీడ్‌ సాత్విక్‌/చిరాగ్‌ 17–21తో తొలి గేమ్‌ను చేజార్చుకున్నా అద్భుతంగా పోరాడి 21–19, 21–18తో అన్‌సీడెడ్‌ కొరియా జంట మిన్‌ హ్యుక్‌ కాంగ్‌/సంగ్‌ జే సియోను చిత్తు చేశారు.
ఈ విజయంతో కాంగ్‌/సంగ్‌ జోడీపై సాత్విక్‌ ద్వయం తన రికార్డును 3–2కు పెంచుకుంది.
 
రెండో సెమీస్‌లో ఆరోన్‌/వూయి 12––21, 23–21, 21–13తో కుసుమవర్ధన/యెరిమియా యాకోబ్‌ (ఇండోనేసియా)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌లో టాప్‌సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌)తో తలపడిన ప్రణయ్‌ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు. దాంతో 15–21, 15–21 స్కోరుతో భారత షట్లర్‌కు పరాజయం తప్పలేదు.