బిజెపి టచ్ లో 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

బిజెపి టచ్ లో 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
‘‘బీజేపీ కార్పొరేటర్లు మాతో టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్‌ కొడుకు అంటున్నడు. ఆయనకు తెలియదేమో 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. అయితే, బీఆర్‌ఎస్‌ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేసే పార్టీ బీజేపీ కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై తాము పోరాడుతుంటే బిజెపిని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
 
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో కూన శ్రీశైలంగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ ఛుగ్‌, ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి సంజయ్‌ బుధవారం రాత్రి ప్రారంభింభిస్తూ బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తెలిపారు. ధరణి వల్ల లాభపడింది కేసీఆర్‌ కుటుంబమేనని ధ్వజమెత్తారు.
కేసీఆర్ కుటుంభం ఆక్రమించుకున్న భూములను రెగ్యులర్ చేసుకునేందుకే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని పేర్కొంటూ ధరణి బాధితులతో ఏకంగా భారీ బహిరంగసభ జరపవచ్చని చెప్పారు. కేసీఆర్‌ వేసిన శిలాఫలాకాలతో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించుకోవచ్చని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్‌ కార్యాలయాలను సెటిల్‌మెంట్లు, దోచుకోవడానికే ఉపయోగిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.  కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదని విమర్శించారు. ఈసారి కారు గుర్తు మీద ఏ ఒక్కరూ గెలవరని జోస్యం చెప్పారు. 5 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని తెలిసే, ముందుగా కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు దండుకునే పనిలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆరోపించారు.  దోచుకున్న సొమ్ముతో విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.
 
ఐదు నెలల్లో కేసీఆర్‌ సర్కారు కూలిపోవడం, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తరుణ్‌ఛుగ్‌ జోస్యం చెప్పారు. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంభం ఫైవ్ స్టార్ హోటళ్ల నుండి మద్యం వ్యాపారం చేస్తూ హైదరాబాద్ నుండి ఢిల్లీ, పంజాబ్ దాకా విస్తరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాజకీయాల నుండి రిటైర్ అయ్యే సమయం ఆసన్నమైనదని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్‌ సచివాలయానికి రావాలంటేనే భయపడుతున్నారని చెబుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.  బీఆర్‌ఎస్ ది 30 శాతం కమీషన్‌ ప్రభుత్వమని డా. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తుంటే కేసీఆర్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వంలో 27 మంది బీసీలతో పాటు 5 మంది మైనారిటీ మంత్రులుగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు.