బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు హిందూస్తానీ అవాం మోర్చా పార్టీ షాకిచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మంత్రి సంతోష్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సుమన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంజీ కుమారుడే సంతోష్ సుమన్.
హిందూస్తానీ అవం మోర్చా పార్టీని జేడీయూలో విలీనం చేయాలంటూ ఆయనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒత్తిడి తెస్తున్నారంటూ సంతోష్ కుమార్ ఆరోపించారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపానని తెలిపారు. జేడీయూ సీనియర్ నాయకుడు, మంత్రి విజయ్ కుమార్ చౌదరిని వ్యక్తిగతంగా కలిసి, రాజీనామాకు గల కారణాలను వివరించానని సుమన్ పేర్కొన్నారు.
మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశాను కానీ మహాఘటబంధన్ నుంచి తమ పార్టీ వైదొలగలేదని సుమన్ స్పష్టం చేశారు. అయితే, పాట్నాలో ఈనెల 23న జరుగనున్న విపక్ష పార్టీల సమావేశానికి హెచ్ఏఎం పార్టీ వెళ్తోందా అని సంతోష్ కుమార్‌ను అడిగినప్పుడు, తమను ఆహ్వానించనప్పడు, తమ పార్టీని ఒక పార్టీగా గుర్తించనప్పుడు ఎలా తమను ఆహ్వానిస్తారని ఆయన ఎదురు ప్రశ్నించారు.
తమ పార్టీ ఉనికికే ముప్పు ఉన్నందున దానిని రక్షించుకునేందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల ఉన్న గౌరవంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, మహాఘటబంధన్‌లో చేరినట్లు సుమన్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తమ పార్టీని మహాఘటబంధన్‌లో కొనసాగిస్తారా? లేక బహిష్కరిస్తారా? అనేది సీఎం నిర్ణయించాలని స్పష్టం చేశారు.
జేడీయూ తన ముందు ఉంచిన ప్రతిపాదన నచ్చకనే, తమ పార్టీని రక్షించుకునేందుకు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. కాగా, బీహార్‌లోని అధికార మహాకూటమి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో హెచ్ఏఎంకు 5 సీట్లు ఇవ్వాలని బీహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ గత శుక్రవారం డిమాండ్ చేశారు.
బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో తమకు 5 సీట్ల కంటే తక్కువ ఇస్తే ఆమోదయోగ్యం కాదని ఆయన సైతం గత వారంలో ప్రకటించారు. బీహార్‌లో గుర్తింపు పొందిన హెచ్ఏఎంను జితిన్ రామ్ మాంఠీ 2015లో స్థాపించారు. బీహార్ అసెంబ్లీలో ఆ పార్టీకి 4 సీట్లు ఉన్నాయి. దళిత నేత అయిన జితిన్ రామ్‌కు మాంఠీ కమ్యూనిటీలో మంచి పేరు ఉంది.

More Stories
రాహుల్, ఖర్గే పార్లమెంటులో క్షమాపణలు చెప్పాలి
మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
ధర్మశాలలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం