అభివృద్ధి లక్ష్యాల సాధనకు న్యాయపరమైన ప్రయత్నాలు

అంతర్జాతీయ అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అందరినీ కలుపుకునిపోయే, న్యాయమైన ప్రయత్నాలను చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారణాసిలో జి 20 దేశాల అభివృద్ధి మంత్రుల సమావేశానిు సోమవారం ఆయన ప్రారంభిస్తూ   ”మహిళల నేతృత్వంలో” అభివృద్ధి నమూనాను భారత్‌ అనుసరిస్తోందని తెలిపారు.
 
భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, కరోనా మహమ్మారి ప్రపంచంలోని పేద దేశాల్లో అభివృద్ధిని ప్రభావితం చేశాయని ప్రధాని చెప్పారు.  ”అభివృద్ధి అనేది ప్రపంచ పేద దేశాలకుకీలకమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలిగించిన అంతరాయాలు, ఆటంకాలకు పేద దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి” అని పేర్కొన్నారు.
 
భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభాలు తలెత్తడం మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలినదని చెబుతూ ఈ పరిస్థితుల్లో ఏ ఒక్కరూ వెనుకబడి పోకుండా చూడాల్సి వుందని మోదీ వీడియో సందేశంలో సూచించారు. డేటా డ్రైవ్‌ వల్ల ఎదురయ్యే సవాళ్ళను అధిగమించాల్సిందిగా జి 20దేశాలను ఆయన కోరారు.
 
పజలకు శక్తి సామర్ధ్యాలను కలిగించడానికి, డేటా అందరికీ అందుబాటులోకి రావడానికి, సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి సాంకేతికత అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. భాగస్వామ్య దేశాలతో తన అనుభవాలు పంచుకోవడానికి భారత్‌ సుముఖంగా వుందని స్పష్టం చేశారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను జి 20 చేపట్టాలని మోదీ కోరారు.
 
అనంతరం విదేశాంగ మంత్రి జై శంకర్‌ మాట్లాడుతూ, ఆహార సరఫరాలో అంతరాయాలను అధిగమించాల్సిన అవసరం వుందని సూచించారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనడానికి అభివృద్ధి చెందిన దేశాలు అనుసరించే ‘లాభదాయకమైన వాటినే ఎంచుకోవడమనే’ పద్ధతి సమర్ధవంతమైన మార్గం కాదని ఆయన స్పష్టం చేశారు.
 
కరోనాకు ముందుగానే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా పురోగతి మందగించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. తదనంతర కాలంలో తలెత్తిన కరోనా మహమ్మారి ఈ పరిస్థితులను మరింత దుర్భరంగా తయారు చేసిందని పేర్కొన్నారు.  2030 నాటికి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకుగానూ 2016 జనవరి 1వ తేదిన 17 బృహత్తర సామాజిక, ఆర్థిక లక్ష్యాలను ఆమోదించారు. వాటినే ఎస్‌డిజి (సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు)గా పేర్కొంటారు.