పాక్ గగనతలంలోకి వెళ్లిన ఇండిగో ఫ్లైట్ కలకలం

భారత్‌కు చెందిన పౌర విమానం ఒకటి పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన ఘటన కలకలం రేపింది. కొన్ని నిమిషాల పాటు ఆ దేశ గగనతలంపై చక్కర్లు కొట్టింది. మళ్లీ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ ఘటన కలకలం రేపింది.  దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ఫ్లైట్ దారి మళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దేశీయ పౌర విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన డొమెస్టిక్ ఫ్లైట్ అది. నంబర్ 6ఇ-645.
 
శనివారం రాత్రి 8 గంటలకు పాకిస్తాన్ సరిహద్దుల్లోని అమృత్‌సర్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు బయలుదేరింది. 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోన్న సమయంలో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ పెను తుఫాన్ గుజరాత్ తీరాన్ని సమీపిస్తోన్న నేపథ్యంలో వాతావరణం బీభత్సంగా మారింది.
 
దీనితో పైలెట్  విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోకి తీసుకెళ్లాడు. సరిహద్దు పట్టణం అటారీ మీదుగా ఈ ఫ్లైట్ పొరుగుదేశంలోకి ప్రవేశించింది. కొన్ని నిమిషాల పాటు అక్కడే చక్కర్లు కొట్టింది. తిరిగి భారత గగనతలంలోకి ప్రవేశించింది. 9:40 నిమిషాలకు అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. షెడ్యూల్ సమయం కంటే కొన్ని నిమిషాలు ఆలస్యంగా విమానం అహ్మదాబాద్‌కు చేరుకుంది.
 
ఈ సందర్భంగా విమాన ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఇండిగో యాజమాన్యం తెలిపింది. ఫ్లైట్ గమనాన్ని రెండు దేశాల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు పర్యవేక్షించారని, సమన్వయంతో అది దారి మళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారని వివరించింది. అమృత్‌సర్ విమానాశ్రయం అధికారులు పాకిస్తాన్ ఏటీసీతో నిరంతరం ఫోన్‌లో మాట్లాడారని పేర్కొంది.
 
ఈ సంఘటనపై పాకిస్థాన్‌ పౌర విమానయాన అథారిటీ అధికారులు స్పందిస్తూ  454 నాట్ల వేగంతో ప్రయాణించిన ఇండిగో విమానం శనివారం రాత్రి 7.30 గంటలకు లాహోర్‌కు ఉత్తరాన తమ గగనతలంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. ఆ విమానాన్ని గైడ్‌ చేయడంతో రాత్రి 8.01 గంటలకు తిరిగి భారత్‌ గగనతలంలోకి వెళ్లిందని చెప్పారు. అయితే ఇది అసాధారణ సంఘటన కాదని అన్నారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో విమానం దారి మళ్లేందుకు అంతర్జాతీయంగా అనుమతి ఉంటుదని వెల్లడించారు.