
దేశంలో అత్యంత అవినీతి పార్టీ వైసీపీ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. . ప్రధానిగా నరేంద్ర మోదీ పాలన 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన ‘జనసంపర్క్ అభియాన్’లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏపీలో జరగని అవినీతే లేదని మండిపడ్డారు. మైనింగ్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్, ఎడ్యుకేషన్ స్కామ్ వైసీపీ హయాంలోనే జరుగుతుందని గుర్తు చేశారు.
నాలుగేళ్లుగా ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. దేశంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని పేర్కొన్నారు. వైసీపీ చేతకాని తనం, జగన్ వైఫల్యం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా రాజధానిలో పనులు జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని జేపీ నడ్డా మండిపడ్డారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని నడ్డా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనను పూర్తి గాలికి వదిలేసిందని పేర్కొంటూ అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడం పోవడం వల్లే పనులన్నీ నిలిచిపోయాయని నడ్డా విమర్శించారు.
ప్రధాని మోదీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని ఆయన స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలను బాధ్యతాయుతమైన రాజకీయాల వైపు మళ్లించారని చెబుతూ దేశమంతా అభివృద్ధి చేయాలనేదే ప్రధాని మోదీ విధానం అని స్పష్టం చేశారు. పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
మోదీ ప్రధాన మంత్రి అయ్యే నాటికి దేశంలో విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని, కానీ ఇవాళ దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే కనిపించదని నడ్డా గుర్తు చేశారు. గతంలో 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ఉండేదని, ఇప్పుడు 2 లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు.
దేశంలో 50 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించిందని జేపీ నడ్డా చెప్పారు. ఇప్పటికే ప్రజల చికిత్సల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసిందని చెబుతూ ఉజ్వల పథకం కింద రూ. 9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని జేపీ నడ్డా తెలిపారు.
ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలు సొంత ఖజానా నింపుకుంటాయి తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోవని పేర్కొంటూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రజల శ్రేయస్సు కోసం పాలకులు పనిచేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి హితవు చెప్పారు. గత తొమ్మిది ఏళ్లలో దేశానికి బీజేపీ అందించిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలందరూ గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. బీజేపీ అధికారాన్ని సేవగా మార్చి చేసే పని చేస్తు్న్న పార్టీ అని ఆమె పేర్కొన్నారు. 2014 కన్నా ముందు రోజుల్లో ప్రతి రోజు ఒక్కో స్కాం గురించి విన్నే వాళ్లమని ఆమె గుర్తు చేశారు. కానీ, మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క స్కాం కూడా జరుగలేదని ఆమె స్పష్టం చేశారు.
ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ప్రధాని మోదీ ఇచ్చే బియ్యంపై కూడా సీఎం జగన్ తన ఫొటోలు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు ఇస్తున్న ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుంటుందని ఆరోపించారు. ఏపీకి కేంద్రం 40 లక్షల ఇళ్లు గ్రాంట్ చేస్తే 20 లక్షలు కూడా నిర్మించలేదని విమర్శించారు. ప్రజల కోసం నిర్మించే రైల్వే లైన్ల కోసం పావలా వంతు నిధుల కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. గ్రామీణ సడక్ యోజన కింద కేంద్రం రోడ్లు వేయిస్తుంటే సీఎం జగన్ మాత్రం ఆ విషయం చెప్పడం లేదని విమర్శించారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ