కుప్పకూలిన టీమిండియా.. ఆస్ట్రేలియాదే డబ్ల్యూటీసీ టైటిల్

కుప్పకూలిన టీమిండియా.. ఆస్ట్రేలియాదే డబ్ల్యూటీసీ టైటిల్
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో భారీ ఓటమి చెంది డబ్ల్యూటీసీ టైటిల్‍ను చేజార్చుకుంది. మ్యాచ్ అయిదో రోజైన ఆదివారం కనీస పోరాటం లేకుండానే చివరి 7 వికెట్లను కేవలం 70 పరుగులు చేసి తొలి సెషన్లోనే కోల్పోయింది భారత జట్టు.
 
లండన్‍లోని ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ అయిదో రోజైన నేడు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 234 పరుగులకే ఆలౌటైంది. 3 వికెట్లకు 164 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజులో అడుగుపెట్టిన భారత్  కేవలం 70 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఏడు వికెట్లను తొలి సెషన్లోనే కోల్పోయింది.  444 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు ఏ మాత్రం గట్టి పోటీని ఇవ్వకుండానే భారత్ ఓటమి పాలైంది.
విరాట్ కోహ్లీ (49), అజింక్య రహానే (46), రవీంద్ర జడేజా (0) సహా ఏ భారత బ్యాట్స్‌మన్‍ కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయారు. ఆస్ట్రేలియాకు ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ టైటిల్ దక్కింది.  ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోల్యాండ్ మూడు, మిచెల్ స్టార్క్ రెండు, కమిన్స్ ఓ వికెట్ తీశారు.
2021 డబ్ల్యూటీసీ ఫైనల్‍లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా.. ఇప్పుడు 2023లో ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‍లో భంగపాటుకు గురైంది. 444 పరుగుల లక్ష్యఛేదనలో విజయం సాధించాలంటే టీమిండియా అయిదో రోజు 280 పరుగులు చేయాల్సింది. అయితే, మిగిలిన ఏడు వికెట్లను 70 పరుగులకే కోల్పోయి పరాజయం పాలైంది. మూడు వికెట్లకు 164 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను నేడు కొనసాగించింది భారత్.

విరాట్ కోహ్లీ, అజింక్య రహానే క్రీజులోకి వచ్చారు. అయితే, వ్యక్తిగత స్కోరుకు ఐదు పరుగులే జోడించుకున్న విరాట్ కోహ్లీ.. బోలండ్ బౌలింగ్‍లో స్మిత్‍కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్లో రవీంద్ర జడేజా (0) డకౌట్‍గా పెవిలియన్ చేరాడు. కాసేపు పోరాడిన అజింక్య రహానే.. ఆసీస్ బౌలర్ స్టార్క్ బౌలింగ్‍లో కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 213 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది భారత్.

తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ (23) కాసేపు దీటుగా ఆడాడు. అయితే మరో ఎండ్‍లో శార్దూల్ ఠాకూర్ (0), ఉమేశ్ యాదవ్ (1) వెంట వెంటనే ఔటయ్యారు. అనంతరం షమీ (13 నాటౌట్)తో కలిసి స్వల్ప భాగస్వామ్యాన్ని భరత్ నెలకొల్పాడు. అయితే, 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భరత్‍ను ఆసీస్ స్పిన్నర్ లయాన్ ఔట్ చేశాడు.

అనంతరం సిరాజ్ (1) కూడా త్వరగా ఔటవటంతో 234 పరుగులకు భారత్ ఆలౌటైంది. 209 పరుగులు తేడాతో డబ్ల్యూటీసీ ఫైనల్‍లో ఆసీస్ గెలిచింది.   తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు శతకం చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‍కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది.  భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 8 వికెట్లకు 270 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసి ఇండియాకు 444 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 234 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో గెలిచింది. కమిన్స్ సేన డబ్ల్యూటీసీ టైటిల్‍ను కైవసం చేసుకుంది.