నిరాడంబరంగా నిర్మలా సీతరామన్‌ కుమార్తె వివాహం

నిరాడంబరంగా నిర్మలా సీతరామన్‌ కుమార్తె వివాహం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ ఏకైక కుమార్తె వాంగ్మయి వివాహం బెంగళూరులో చాలా నిరాడంబరంగా జరిగింది. బెంగుళూరులోని ఉడిపి అడమారు మఠంలో బ్రాహ్మణ సంప్రదాయ పద్దతిలో పరకాల వాంగ్మయి, ప్రతీక్ దోషిల వివాహం జరిగింది.  ఉడిపికి చెందిన అడమారు మఠంలో బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వివాహాన్ని నిర్వహించారు. 
వివాహ వేడుకకు రాజకీయ నాయకులెవరినీ ఆహ్వానించలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, వధువరులకు చెందిన స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వధువు గులాబీ రంగు చీర కట్టుకోగా, వరుడు తెల్లటి పంచె, శాలువా ధరించాడు. ఈ వివాహానికి సంబంధించిన వీడియోను ఉడిపిలోని అడమారు మఠం ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఉడిపి అడమారు మఠంతో ఉన్న అనుబంధం నేపథ్యంలో వివాహ వేడుకను అక్కడ నిర్వహించినట్లు తెలుస్తోంది.

వాంగ్మయి వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న ఓ జాతీయ దినపత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తోన్నారు. ప్రత్యేకించి- ఆర్ట్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, సాహిత్యం మీద వార్తలను రాస్తుంటారు. గుజరాత్‌కు చెందిన వరుడు ప్రతీక్‌ ప్రధాని మోదీ కార్యాలయంలో  స్పెషల్ డ్యూటీ అధికారిగా పనిచేస్తున్నారు.

2014లో ఆయన ఢిల్లీ పవర్ కారిడార్‌కు మారినా, మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత పిఎంఓలో చేరారు. జూన్ 2019లో జాయింట్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. ప్రతీక్ దోషి సింగపూర్ మేనేజ్‌మెంట్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. గతంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంఓ రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.

పిఎంఓ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, పిఎంఓ పరిశోధన, వ్యూహ విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. “భారత ప్రభుత్వ వ్యాపార కేటాయింపు నియమాలు విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లల పెళ్లిళ్లు ఆడంబరంగా జరుగుతుంటాయి. దీనికి భిన్నంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన ఒక్కగానొక్క కూతురు పెళ్లిని సాదాసీదాగా నిర్వహించి ఆదర్శంగా నిలిచారు.ఈ వివాహానికి అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు ఎవర్నీ ఆహ్వానించలేదని తెలుస్తోంది.