రాజకీయ ఉనికి కోసం బీజేపీ వైపు చూస్తున్న జేడీఎస్!

రాజకీయ ఉనికి కోసం బీజేపీ వైపు చూస్తున్న జేడీఎస్!
ఎప్పుడు ఎన్నికలు జరిగినా 30 నుండి 40 సీట్లు గెల్చుకోవడం, ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లకు స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో `కింగ్ మేకర్’గా ముఖ్యమంత్రి పదవికి బేరం ఆడడం పరిపాటిగా మారిన కర్ణాటకలోని జేడీఎస్ కు ఇప్పుడు కేవలం 19 సీట్లు మాత్రమే దక్కడంతో రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
 
ముఖ్యంగా ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న పాత మైసూర్ ప్రాంతంలో ప్రాబల్యం తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. అందుకనే ఏదో విధంగా బిజెపి దగ్గరకు చేరుకొని, తమ రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
 
గత కొన్ని రోజులుగా మాజీ ప్రధాని దేవెగౌడ చేస్తున్న ప్రకటనలు ఇటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపితో తలపడేందుకు ప్రతిపక్షాలు ఉమ్మడి వేదిక ఏర్పర్చుకొనేందుకు ముమ్మర యత్నాలకు దిగుతున్న క్రమంలోనే దేవెగౌడ సారధ్యపు జెడిఎస్ ఇప్పుడు ప్రధాని మోదీ వైపు మొగ్గు సంకేతాలు వెలువరిస్తున్నది.
 
ఇటీవల పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంకు ప్రతిపక్షాలు బహిష్కరించిన దేవెగౌడ మాత్రం హాజరయ్యారు. ఆయనను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పలకరించడం అందరి దృష్టిని ఆకట్టుకొంది.  2019 లోక్‌సభ ఎన్నికలలో కర్నాటకలో జెడిఎస్‌కు ఒకే ఒక్క స్థానం దక్కింది. స్వయంగా దేవెగౌడ ఓటమి చెందారు.
 
మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి కుమారుడు కూడా ఓటమి చెందారు. కేవలం, దేవెగౌడ పెద్ద కుమారుడు రేవన్న కుమారుడు మాత్రమే గెలుపొందారు. బిజెపి చెంత చేరి పార్లమెంట్ లో పార్టీ ఉనికి కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.  ఒకప్పటి మిత్రపక్షమైన బిజెపితో జతకడితే కాంగ్రెస్‌ ను ఓడించి తన ఓట్‌బేస్‌ను కాపాడుకునే అవకాశాన్ని అంచనా వేస్తున్నట్లు సమాచారం.
 
2006లో ఈ కాంగ్రెస్ కంచుకోట రాష్ట్రంలో బిజెపితో చేతులు కలిపి జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. అప్పట్లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా, బిజెపి నేత యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చెరో 20 నెలల పాటు అధికార పంపిణీ ఫార్మూలాతో సాగారు.
 
అయితే, తన ముఖ్యమంత్రి పదవీకాలం పూర్తయిన తర్వాత బీజేపీ అభ్యర్థి యడ్డ్యూరప్పను ముఖ్యమంత్రిగా చేసేందుకు మద్దతు ఇవ్వక పోవడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టింది. 2018 ఎన్నికలలో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
 
అయితే కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కొందరు తిరుగుబాటు చేయడంతో ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగింపలేక పోయింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది.  ఇప్పుడు రాజకీయ అనివార్యంగా జెడిఎస్ తిరిగి 17 ఏళ్ళ తర్వాత బిజెపి చెంత చేరేందుకు సంకేతాలు ఇస్తున్నారు.  ఇటీవలే ఒడిషాలో ఘోర రైలు ప్రమాదం జరిగినప్పుడు కొన్ని ప్రతిపక్షాలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని కోరగా దేవెగౌడ కేంద్ర రైల్వే మంత్రికి మద్దతుగా ప్రకటన వెలువరించారు.
 
“జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి రైల్వే మంత్రి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అతను అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు. విచారణ పూర్తి చేయనివ్వండి. మంత్రి తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ దశలో అతని ని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడం తెలివైన పని కాదు” అంటూ ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. ఇదంతా కూడా బిజెపిని ప్రసన్నం చేసుకోవడానికే అనే ప్రచారం జరుగుతోంది.

2024 లోక్‌సభ ఎన్నికలకు `మతతత్వ’ బీజేపికి వ్యతిరేకంగా విపక్షపార్టీలన్నీ ఏకం కావడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆయన పెదవి విప్పకపోయినా  ఏ పార్టీ మతపరమైనది, ఏ పార్టీ కాదో తాను చెప్పలేనని అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఏదైనా పార్టీ బీజేపీతో సంబంధం లేనిదంటూ ఉందా? ఉంటే చూపించండి అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.

అయితే, కర్ణాటకలో ముందుచూపుతో తన ప్రాతిపదికను పటిష్ట పరచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నుండి ఇప్పటివరకు ఎటువంటి సానుకూల స్పందన కనిపించడం లేదు.