ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆత్మహత్యాయత్నం
ఓవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుండగా, ఢిల్లీలో బెల్లంపల్లి ఎమ్మెల్యే (బీఆర్ఎస్) దుర్గం చిన్నయ్య బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతుంది.  ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో పార్కింగ్ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మహిళను అక్కడున్నవారు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాధిత మహిళ తాగిన పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
 
ప్రత్యక్షసాక్షుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత వాంగ్మూలం నమోదు చేసుకుంటామని చెప్పారు.  బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బహిరంగంగా నిరసన ప్రదర్శనలు కూడా ఆమె చేపట్టారు.
 
పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయడం లేదన్న కారణంతో ఆమె మద్ధతుదార్లతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతకు ముందు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఎమ్మెల్యే లైంగిక వేధింపులు, తెలంగాణ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు.
 
అయితే ఢిల్లీలో నిరసన ప్రదర్శన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే తన అనుచరులతో సోషల్ మీడియా ద్వారా మరింత వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఒక సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులైన భీమా గౌడ్, చిల్లరపు సంతోష్, కుమ్మరి పోచన్న, కోనంకి కార్తీక్ తనను గత కొంత కాలంగా వేధిస్తున్నారని, చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని బాధిత మహిళ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
 
ఢిల్లీ వచ్చినప్పటి నుంచి తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు, అసభ్యకరమైన కామెంట్లతో తీవ్ర వేదనకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ అవమానం భరించలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాననంటూ లేఖలో తెలిపారు. ఈ వేధింపులపై తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోని తెలంగాణ పోలీసులు తనపైనే తప్పుడు కేసులు పెట్టారని కూడా వెల్లడించారు.
 
 తాను చనిపోయిన తర్వాతైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని సూసైడ్ లెటర్‌లో ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ భవన్ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనపై రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఆరా తీసినట్టు తెలిసింది. ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.