ఏప్రిల్ లో మరోసారి పెరిగిన అమెరికా ద్రవ్యోల్బణం

జర్మనీ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోగా, తాజాగా అమెరికా ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్ నెల లో మరోసారి పెరిగింది. అమెరికాలో ప్రజల ఖర్చులు, దీంతో పాటు వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఈమేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగత వినియోగ వ్యయాల ధర సూచి ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో అంచనా కంటే 0.4 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో ఇది 4.4 శాతానికి పెరగ్గా, అంతకుముందు మార్చిలో ఇది 4.2 శాతంగా ఉంది.

2023 జనవరి తర్వాత ద్రవ్యోల్బణం పెరగడం ఇదే మొదటిసారి. సేవలు, ఆహారం, వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం రేటు పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారం, ఇంధనం ద్రవ్యోల్బణం మినహా గత నెలలో ద్రవ్యోల్బణం 4.7 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు బాటపడుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

వచ్చే నెలలో(జూన్) ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది, ఈ సమయంలో వడ్డీ రేట్ల పెరుగుదలను ప్రకటించే అవకాశముంది. అయితే ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడంపై రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రే ట్లు పెంచాలని కొందరు భావిస్తుండగా, మరోవైపు ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ ఖరీదైన రుణాల భారాన్ని భరించాల్సి ఉంటుందని మరి కొందరు పేర్కొంటున్నారు.

మేలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఫెడ్ పాలసీ రేటును పెంచింది. ఫెడ్ రిజర్వ్ రేటు 25 బేసిస్ పా యింట్లు పెరిగింది. ఈ పెరుగుదలతో వడ్డీ రేటు 5.25 శాతానికి చేరింది. ఈ పెంపుతో అమెరికాలో వడ్డీ రేటు 16 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.

రుణ సంక్షోభంలో అగ్రరాజ్యం

కాగా, ప్రభుత్వ రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక ఒప్పందం ఒకటి, రెండ్రోజుల్లో కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. మరోవైపు అమెరికాలో తీవ్ర ఆర్థిక కల్లోలానికి దారి తీయగల ఈ సంక్షోభ పరిష్కారానికి గడువును మరో నాలుగు రోజులు అంటే జూన్ 5 వర కు పొడిగించడంతో వైట్‌హౌస్‌కు, ప్రతిపక్ష రిపబ్లికన్ల మధ్య చర్చలు వచ్చే వారమంతా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికా ఆర్థిక మంత్రి (ట్రెజరీ సెక్రటరీ) జా నెట్ యెల్లెన్ రాసిన లేఖలో నిర్ణయించిన ఈ కొత్త గడువు ఇంతకుముందు అంచనా వేసినదానికన్నా నాలుగు రోజులు ఎక్కువగా ఉండడం గమనార్హం. మరో వైపు వచ్చే వారం సోషల్ సెక్యూరిటీ చెల్లింపుల గడువు దగ్గరపడుతుండడంతో రిటైరయినవాళ్లు, ఇతరులుఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనన్న భయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.