కృష్ణా జలాల్లో సగం వాటాకు తెలంగాణ పట్టు

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ ఇప్పట్లో తేలేలా లేదు. నీటి వాటా కేటాయింపుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) చేతులెత్తేసింది. ఇక కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది. కేంద్ర జలశక్తి శాఖ ఈ విషయాన్ని నివేదిస్తామని వెల్లడించింది. జల విద్యుత్‌ ఉత్పత్తి, రూల్‌ కర్వ్స్‌, వరద సమయంలో నీటి లెక్కలకు సంబంధించి జలాశయాల నిర్వహణ కమిటీతో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఛైర్మన్‌ శివనందన్‌ కుమార్‌ నేతృత్వంలో కేఆర్ఎంబీ 17వ సమావేశం హైదరాబాద్‌ లో జరిగింది.  ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌, ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్సీ నారాయణరెడ్డి ఇతర సభ్యులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో తాగునీటి వినియోగాన్ని 20 శాతంగానే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ కోరడంతో దీనిపై సాంకేతికంగా అధ్యయనం చేయించాలని బోర్డు నిర్ణయించింది.
కృష్ణా జలాల వినియోగంలో గత తొమ్మిదేళ్లుగా అమలవుతున్న 66:34 నిష్పత్తిని మున్ముందు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. గతంలో అన్ని ఆలోచించే ఆ ప్రాతిపాదిక నిర్ణయించారని ఎపి అధికారులు తెలిపారు. కేటాయింపులు మార్చే అధికారం ట్రిబ్యునల్‌కు తప్ప, మరెవరికీ లేదని ఎపి స్పష్టం చేసింది. అయితే ఈ నిష్పత్తి తమకు ఆమోదయోగ్యం కాదని వాదించిన తెలంగాణ తాత్కాలిక కేటాయింపును తాము వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ కలిపితే 105 టీఎంసీలు వస్తుందని తెలంగాణ తెలిపింది. కృష్ణా జల్లాలో మొత్తం 811 టీఎంసీల్లో సగం వాటా తెలంగాణకు కావాల్సిందేనని వాదనలు వినిపించారు. అయితే నీటి అవసరాలకు త్రిసభ్య కమిటీ ద్వారా నీటిని విడుదలపై ఆదేశాలు ఇస్తూ వాటా తేల్చే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణ, ఎపి వాటా తేల్చే అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని సమావేశం నిర్ణయించిందని తెలిపారు. శ్రీశైలం నుంచి ఎపి 34 టిఎంసిలు మాత్రమే తీసుకునేలా ఆదేశిస్తే జలవిద్యుదుత్పత్తి అంశంపై మాట్లాడతామని చెప్పారు. సుంకిశాల ఇన్‌ టేక్‌ వెల్‌పై , పాలమూరు – రంగారెడ్డి కేటాయింపులపై ఎపి అభ్యంతరాలు తగవని హితవు చెప్పారు. తెలంగాణకు ఉన్న కేటాయింపుల నుంచే సుంకిశాల ద్వారా హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకుంటామని చెప్పారు.
కృష్ణ జలాల విషయంలో ఏపీకి మద్దతుగా నిలబడి కేసీఆర్ నిజాయితీని నిరూపించుకోవాలని ఏపీ బీజేపీ నేతలు కోరారు. నీటి సమస్య విస్తృతమైనదని, దీనిపై రాజకీయాలు పక్కన పెట్టాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎం విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో హడావుడి చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఏపీ బీఆర్ఎస్ నేతలు కృష్ణా జలాల విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.  దిగువ రాష్ట్రమైన ఏపీకి కృష్ణా జలాల కేటాయింపులపై మద్దతుగా మాట్లాడాలని సూచించారు. రాయలసీమకు చెందాల్సిన నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు వదిలివేస్తున్న వైనంపై మంత్రి కేటీఆర్ స్పందించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.