ఢిల్లీ పాల‌నాధికారం ముఖ్య‌మంత్రిదే

ఢిల్లీ పాల‌నాధికారం ముఖ్య‌మంత్రిదే
ఢిల్లీ పాలన వ్యవహరాలపై సుప్రీంకోర్టు గురువారంనాడు కీలక తీర్పును వెల్లడించింది. ఢిల్లీ సర్కార్ కు అధికారాలు లేవన్న గత తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికైన ప్రభుత్వానికి అసలైన అధికారాలు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
 
శాంతి భద్రతలు మినహా మిగిలిన అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.  ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య నెలకొన్న వివాదంపై ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు  ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.
 
‘ఢిల్లీ శాసనసభకు ఉన్న అధికారాలన్నీ ప్రభుత్వానికి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వానికి సేవలపై శాసన, కార్యనిర్వాహక అధికారం ఉంది. 2019లో జస్టిస్ అశోక్ భూషణ్ తీసుకున్న నిర్ణయంతో మేము ఏకీభవించబోం’ అని రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. పాలనా యంత్రాంగంపై నియంత్రణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది.
 
 ఇతర శాసనసభల మాదిరిగానే ఢిల్లీ శాసనసభ సభ్యులూ ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతారని సుప్రీంకోర్టు పేర్కొంది. 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది. ఢీల్లీలో పాలన వ్యవహరాలు ఎవరు చూడాలన్న విషయమై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
 
ఢిల్లీ పాలన వ్యవహరాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అనవసరంగా జోక్యం చేసుకోవద్దని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఒక్క శాంతి భ‌ద్ర‌త‌ల అంశం మినహా మిగ‌తా అన్ని పాల‌నాకారాలు ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వాధినేత‌కే ఉంటుంద‌ని తేల్చి చెప్పింది.