కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నాయి. కొందరికి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రకటించినప్పటి నుంచి అభ్యర్థుల ఖర్చుపై గట్టి నిఘా పెట్టామని ఈసీ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ.288 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిందని వెల్లడించారు.
ఎన్నికల సంఘం చేసిన విస్తృత సోదాల్లో మొత్తం రూ.375 కోట్లు విలువ చేసే మద్యం, డ్రగ్స్, నగదు, వస్తువులు పట్టుబడ్డాయి. కర్ణాటకలో ఎన్నికలలో ప్రలోభాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రకటించినప్పటి నుంచి అభ్యర్థుల ఖర్చుపై గట్టి నిఘా పెట్టామని ఈసీ అధికారులు పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం అధికారికంగా సీజ్ చేసిన మొత్తమే ఇన్ని కోట్లు ఉంటే, ఇక అనధికారంగా ఎంత ఖర్చు చేసి ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది. 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా రూ.83.93 కోట్లు పట్టుబడితే ఈసారి ఆ మొత్తం నాలుగు రెట్లకు పైగా పెరగడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగుతుంది. మొత్తం 224 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేసిన అధికారిక గణాంకల ప్రకారం కర్ణాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం వివరాలు: నగదు రూ.147.46 కోట్లు, దొరికిన మద్యం విలువ రూ.83.66 కోట్లు, దొరికిన డ్రగ్స్ విలువ రూ.23.67 కోట్లు,దొరికిన వస్తువుల విలువ రూ.96.6 కోట్లు, ఉచితంగా పంపిణీ చేసిన వాటి విలువ రూ.24.21 కోట్లు.
ప్రధానంగా కోలార్ జిల్లాలోని బంగారుపేట నియోజకవర్గంలో రూ. 4.04 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బీదర్ జిల్లాలో వంద కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బెళగావి జిల్లా బైల్ హోంగల్లో ప్రెషర్ కుక్కర్లు, సవదత్తిలో 1000కు పైగా కుట్టు మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ సీట్లను విచ్చలవిడిగా ఖర్చుచేసే నియోజకవర్గాలుగా ఈసీ గుర్తించింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అభ్యర్థుల కదలికలపై గట్టి నిఘా వేశామని ఈసీ అధికారులు తెలిపారు. ‘‘ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు చేసిన ప్రయత్నాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నాం. ఇందుకోసం ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకున్నాం. దీంతో భారీగా డబ్బు, మద్యం, హోం అప్లయెన్సెస్ వంటి వస్తువులను స్వాధీనం చేసుకోగలిగాం” అని ఈసీ అధికారులు పేర్కొన్నారు. పూర్తి పారదర్శక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసారి అభ్యర్థుల కదలికలపై గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు.

More Stories
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్లో 17వ నంబర్ భవనం
అమెరికాలో ముగిసిన షట్డౌన్
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు