
ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బట్ట బయలైనట్టు ఎన్ ఫోర్స్ మెంట్ ఈడీ ప్రకటించింది. ఏకంగా రూ.2వేల కోట్ల అవినీతిని గుర్తించినట్టు వెల్లడించింది. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ నేత, రాయ్ పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్ ను ఈడీ మే 6న అరెస్టు చేసింది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించింది.
ఈ కేసులో అన్వర్ దేబర్‌ను నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా మనీ లాండరింగ్ కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్టు తెలిపింది. ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సోదాల్లో కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని, ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది. 2019 నుంచి 2022 మధ్య కాలంలో దాదాపు రూ.2,000 కోట్ల మేరకు అవినీతి, మనీలాండరింగ్ జరిగినట్లు వెల్లడైంది.
ఛత్తీస్‌గఢ్‌లో అన్వర్ దేబర్ నాయకత్వంలో వ్యవస్థీకృత క్రిమినల్ సిండికేట్ పని చేస్తోంది. అన్వర్ సాధారణ ప్రైవేటు వ్యక్తి అయినప్పటికీ, అత్యున్నత స్థాయి రాజకీయ నేతలు, సీనియర్ బ్యూరోక్రాట్ల కోసం ఆయన పని చేశాడు. రాష్ట్రంలో విక్రయించే ప్రతి మద్యం సీసాకు చట్టవిరుద్ధంగా సొమ్మును వసూలు చేసే విస్తృత స్థాయి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
విస్తృతమైన కుట్రతో ఈ వ్యాపారాన్ని నిర్వహించాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కుంభకోణంలో అనేక మంది ముఖ్య రాజకీయ నేతలు, ఉన్నత స్థాయి అధికారులు ఆరోపణలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లో మద్యం దుకాణాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ప్రైవేటు దుకాణాలు లేవు. రాష్ట్రంలో విక్రయించే మద్యాన్ని ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సేకరించి, రిటెయిల్ దుకాణాలకు ఇస్తుంది. టెండర్లు జారీ చేసి, మేన్‌పవర్ సప్లయర్స్‌ను ఎంపిక చేస్తుంది. వీరు మద్యం రిటెయిల్ దుకాణాలను నిర్వహిస్తారు.
రాజకీయ నేతల సహకారంతో అన్వర్ దేబర్ ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. అన్ని స్థాయుల్లోని అధికారులను తనవైపు తిప్పుకుని అవినీతికి పాల్పడినట్లు తెలిపింది. 35 చోట్ల సోదాలు జరిపి ఈ కుంభకోణాన్ని ఈడీ వెలికి తీసింది. ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలలో ఈ సోదాలు జరిగాయి.
అన్వర్ రహస్య ద్వారం నుంచి తప్పించుకుని, విచారణకు సహకరించలేదు. ఈడీ ఆయనకు ఏడుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన దర్యాప్తునకు సహకరించలేదు. ఆయన బినామీ పేర్ల మీద ఇంటర్నెట్ డాంగుల్స్, ఫోన్ సిమ్ కార్డులను ఉపయోగించాడు. తరచూ బసను మార్చేవాడు. చివరికి ఆయన తన సహచరుని హోటల్ గదిలో పట్టుబడ్డాడు. ఆయనను అరెస్టు చేసి, రాయ్‌పూర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి ఆదేశించింది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్