
తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడటంతో పాటు ఉపరితల ఆవర్తనం దాదాపు ఉత్తరం వైపుగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే, తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ దిశగా వెళ్లే అవకాశం ఉందని, రాష్ట్రానికి ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు.
ఏదేమైనప్పటికీ అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని, వేటకు వెళ్లినవారు శనివారం లోగా తిరిగి రావాలని కోరారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేందుకు స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ