భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బుధవారం శంకుస్థాపన చేశారు. మొత్తం 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్‌ లిమిటెడ్‌ నిర్మిస్తోంది.

3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్‌ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు సీఎం జగన్ తారకరామ తీర్ధ సాగరం పనులకు శ్రీకారం చుట్టారు. పెండింగ్‌ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేయనుని ప్రకటించారు.

 2024 డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అలాగే చింతపల్లి చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌‌కు శ్రీకారం చుట్టారు. పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మించనున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశామని చెప్పుకున్నారని ఈ సందర్భంగా జగన్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత కుట్ర చేసి కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారని, ఆ అడ్డంకుల్ని దాటుకుని ఇవాళ శంకుస్థాపన చేశామని చెప్పారు.

 
2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్‌ టేక్‌ ఆఫ్‌ అవుతుందని వెల్లడించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని చెబుతూ మొన్నే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది పేర్కొన్నారు.
 
ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగుతాయని, ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో జాబ్‌ హబ్‌గా మారనుంది ముఖ్యమంత్రి భరోసా వ్యక్తం చేశారు.  ఉత్తరాంధ్రలోని కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టామని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేశామని, ఉద్ధానంలో కిడ్నీ రీసర్చ్‌ సెంటర్‌ పనులను పూర్తి చేశామని తెలిపారు.
 
 జూన్‌ నెలలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను జాతికి అంకితం ఇస్తామని ప్రకటించారు. ఇచ్చాపురం, పలాసలకు రక్షిత తాగు నీరు అందిస్తామని, అలాగే సాలూరులో డ్రైవర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభమవుతుందని మరోసారి ప్రకటించారు.
అదానీ గ్రూప్ ప్ర‌తినిధులు రాజేష్ ఆదానీ, కరన్ ఆదానీల‌తో క‌లిసి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విశాఖపట్నంలో డేటా సెంట‌ర్ నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభిస్తూ  దేశంలోనే అతిపెద్ద డేటా సెంట‌ర్ విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు కానుండంటం త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని  చెప్పారు.  ఈ డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.
డేటా సెంటర్‌తో 39 వేల మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు.  డేటా సెంటర్‌తో రాస్ట్ర ముఖచిత్రమే మారబోతోందని స్పష్టం చేశారు.  ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవని,  కానీ రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి మొత్తం మారిపోతుందని జగన్ స్పష్టం చేశారు.