
ఒక్కసారిగా అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటించింది. ఆస్పత్రి మీడియా సెల్ ఇంచార్జి ప్రొఫెసర్ డా. రీమా దాదా పేరటి విడుదల చేసిన ప్రకటనలో కిషన్ రెడ్డి కడుపులో అసౌకర్యం కారణంగా ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఆదివారం రాత్రి గం. 10.30 సమయంలో అస్వస్థతకు గురైన కిషన్ రెడ్డి హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరారు. తొలుత ఛాతిలో నొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు కథనాలు వచ్చాయి. అయితే కిషన్ రెడ్డి కార్యాలయ సిబ్బంది ఆ వార్తలను ఖండించారు.
కడుపులో అసౌకర్యం కారణంగా చేరారని, పెద్దగా ఆందోళన చెందాల్సిందేమీ లేదని వివరణ ఇచ్చారు. కార్డియాలజీ విభాగం ఎయిమ్స్‌లో వైద్య బృందం ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తేల్చారు. అదే విషయాన్ని సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన రూపంలో తెలియజేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి