
ఉత్తర ప్రదేశ్ లో మాఫియా సోదరులుగా పేరొందిన అన్సారీ బ్రదర్స్ ను ఒక హత్య కేసులో కోర్టు దోషులుగా తేల్చి జైలు శిక్ష విధించింది. ఆ సోదరులలో ముఖ్తార్ అన్సారీ మాజీ ఎమ్మెల్యే కాగా, అఫ్జల్ అన్సారీ ప్రస్తుత ఎంపీ. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ హత్య కేసులో రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ ని ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు దోషిగా నిర్ధారించింది.
అతడికి రూ. 5 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించింది. ముఖ్తార్ అన్సారీ బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే. ఇదే కేసులో ముఖ్తార్ అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీని కూడా దోషిగా తేల్చిన ఘాజీపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. రూ. 1 లక్ష జరిమానా విధించింది.
అన్సారీ సోదరులకు జైలు శిక్ష పడడంపై బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ భార్య అల్కా రాయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ గూండా రాజ్యం, మాఫియా రాజ్యం అంతమైందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ ని 2005లో ఘాజీ పూర్ లో హత్య చేశారు. ఆయనను అన్సారీ సోదరులే హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి.
స్వగ్రామంలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయనపై సాయుధ దుండగులు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ తో పాటు ఎనిమిది మంది చనిపోయారు. దాదాపు 15 సంవత్సరాల దర్యాప్తు అనంతరం వారి నేరం రుజువై జైలు శిక్ష పడింది.
ముఖ్తార్ అన్సారీ పై ఉస్రీ చట్టీ గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి కూడా మరో హత్య కేసు ఉంది.
ముఖ్తార్ అన్సారీ 5సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1996లో విశ్వహిందూ పరిషత్ నేత నందకిశోర్ రుంగ్తాను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు ఆరోపనలు ఉన్నాయి.
ఘాజీపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో మరో ఎంపీపై అనర్హత వేటు పడనుంది. ఈ కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన అఫ్జల్ అన్సారీ ఘాజీపూర్ నుంచి బీఎస్పీ తరఫున ఎంపీ గా గెలుపొందారు.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న అఫ్జల్ అన్సారీని కోర్టు దోషిగా తేల్చి జైలు శిక్ష విధించడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడు కానున్నారు. ప్రధాని మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై ఇప్పటికే ఈ అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’