
2020లో చోటు చేసుకున్న గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన నాయక్ దీపక్ భార్య తన భర్తను స్ఫూర్తిగా తీసుకొని ఆర్మీలో చేరింది. భార్య రేఖా సింగ్ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా నియామకం అయినట్లు భారత ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు. లఢక్‌లోని ఎల్ఏసీ వద్ద రేఖా సింగ్ విధులు నిర్వర్తించనుంది.
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో రేఖా సింగ్ ఏడాది పాటు శిక్షణ తీసుకుంది. ఆ శిక్షణ నేటితో ముగిసిందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేఖా సింగ్‌కు కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ రెజిమెంట్‌కు చెందిన 16వ బెటాలియన్‌లో పని చేస్తున్న నాయక్ సింగ్‌కు మరణానంతరం వీర్ చక్ర అవార్డును కేంద్రం 2021లో ప్రకటించింది.
ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి మహిళా ఆర్మీ అధికారులు
ఇలా ఉండగా, దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులను తీసుకున్నది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అడకామీ (ఓపిఎ)లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు శనివారం ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరారు.
ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరిన మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెఫ్టినెంట్ పవిత్రా మౌద్గిల్ ఉన్నారని అధికారులు తెలిపారు. ఐదుగురు మహిళా అధికారుల్లో ముగ్గురిని చైనా సరిహద్దు వెంబడి మోహరించిన యూనిట్లలో, మిగతా ఇద్దరిని పాక్ సరిహద్దుకు సమీపంలో ‘సవాల్‌తో కూడుకున్న ప్రదేశాల్లో’ నియమించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నారు.
ఆర్టిలరీ రెజిమెంట్‌లో మహిళా అధికారులను నియమించడం భారత సైన్యంలో వస్తున్న మార్పులకు నిదర్శనమని ఆ వర్గాలు తెలిపాయి. జనవరిలో ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆర్టిలరీ యూనిట్లలో మహిళా అధికారులను నియమించినట్లు ప్రకటించారు. ఈ మేరకు సైన్యం ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా ఆమోదం తెలిపింది. దాంతో తొలిసారిగా ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి ఐదుగురు మహిళా అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది.
కాగా, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పాసింగ్ పరేడ్ జరిగింది. 189 క్యాడెట్స్ శిక్షణ పొందగా ఇందులో భూటాన్‌కు చెందిన 29 మంది క్యాడెట్స్ ఉన్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌ను బంగ్లాదేశ్ ఆర్మీ జనరల్ ఎస్‌ఎం షఫీయుద్దీన్ అహ్మద్ సమీక్షించి, క్యాడెట్స్‌ను అభినందించారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం