
కాంగ్రెస్ ఇప్పటికి తనను 91 సార్లు తిట్టిందని, తనను నిందించడమే పనిగా పెట్టుకున్నా తాను మాత్రం కర్ణాటక ప్రజల కోసమే మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే, తనను తిట్టిన ప్రతిసారీ కాంగ్రెస్ ఘోరపరాభవం చవి చూస్తోందని ఎద్దేవా చేశారు. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని శనివారం ప్రసంగిస్తూ మోదీ విషసర్పమని, తాకితే ఖతం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
తనను తిట్టినప్పుడల్లా ప్రజలు కాంగ్రెస్ను చిత్తుగా ఓడిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల కష్టాలను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని, కాంగ్రెస్ హయాంలో సొంతింటి కల మందగమనంలో సాగేదని పేర్కొంటూ బీజేపీ వచ్చిన తర్వాతే మహిళలకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించడమైందని ప్రధాని గుర్తు చేశారు.
దేశం కోసం, పేదల కోసం పనిచేసే వారెవరినైనా దుర్భషలాడటం కాంగ్రెస్ కు పరిపాటి అని చెబుతూ తనను గతంలో `చౌకీదార్ చోర్’, `మోదీ చోర్’ అంటూ నిందించారని ప్రధాని గుర్తు చేశారు. తర్వాత మొత్తం ఓబిసి ప్రజలు దొంగలని అన్నారని, ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి లింగాయత్ సోదరులు, సోదరీమణులు అందరూ `చోర్’ అంటున్నారని మోదీ మండిపడ్డారు.
కాంగ్రెస్ హయాంతో పోల్చుకుంటే రాష్ట్రంలో బీజేపీ హయాంలో విదేశీ పెట్టుబడులు మూడింతలు పెరిగాయని , రాష్ట్రం డబుల్ డెవలప్మెంట్ , డబుల్ స్పీడ్తో ఉందని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్ రైతులకు కేవలం తప్పుడు హామీలు ఇవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం రైతులు పొందలేదని మోదీ విమర్శించారు. బీజేపీని మరోసారి గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.
మే 10 న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు గెలుపోటములకు సంబంధించిన విషయం కాదని, ఈ ఎన్నికలు కర్ణాటకను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చడానికి సంబంధించిన ఎన్నికలని ప్రధాని స్పష్టం చేశారు. అనంతరం విజయపురలోఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
‘‘కాంగ్రెస్ నాయకులు ఇవే నా చివరి ఎన్నికలు.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. ఈ ఒక్క సారి గెలిపించండి’’ అని ఓటర్లను అడుక్కుంటున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘‘చూడండి వారు ఏ పరిస్థితికి దిగజారారో’’ అని కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలు చేశారు. అలసి పోయి, ఆసక్తి లేని కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించబోరని, ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న బీజేపీనే గెలిపిస్తారని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఈ సారి పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం’’ అనే నినాదం ఇప్పుడు రాష్ట్రమంతా వినిపిస్తోందని ఆయన చెప్పారు.
More Stories
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు