
దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహాలోనే జగన్నాథ ఆలయాలను నిర్మించారు. ఇప్పుడు బ్రిటన్ లో తొలి జగన్నాథ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. రూ. వందల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు.
లండన్ శివారులో నిర్మించే ఈ ఆలయం కోసం అక్కడి స్థానికులంతా కలిసి శ్రీ జగన్నాథ సొసైటీ యూకే (ఎస్జేఎస్యూకే) పేరిట ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి ఈ సొసైటీ విరాళాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన బిశ్వనాథ్ పట్నాయక్ అనే ప్రవాస భారతీయుడు ఆలయ నిర్మాణానికి ఏకంగా రూ.250 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
విదేశాల్లో ఆలయ నిర్మాణానికి ఇంత పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి. శ్రీ జగన్నాథ సొసైటీ యూకే పేరుతో ఏర్పాటైన ఈ కమిటీ అక్షయ తృతీయ రోజున ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ వేడుకకు బిశ్వనాథ్ను కూడా ఆహ్వానించారు. భూరి విరాళం సమర్పించిన బిశ్వనాథ్ పట్నాయక్ వృత్తి రీత్యా యూకేలో స్థిరపడ్డారు. లండన్లో ఫిన్నెస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు.కాగా, లండన్ శివారులో దాదాపు 15 ఏకరాల్లో ఈ దేవాలయాన్ని నిర్మించనున్నారు. 2024 చివరి నాటికి ఆలయం తొలి విడత నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు ఎస్జేఎస్యూకే ప్రణాళిక రచిస్తోంది. ఈ ఆలయం ఐరోపాలో జగన్నాథ సంస్కృతికి కేంద్రంగా మారుతుందని శ్రీ జగన్నాథ సొసైటీ యూకే చైర్మన్ డాక్టర్ సహదేవ్ స్వైన్ తెలిపారు.
వేలాది మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన ఎన్నికల ప్రచార సమయంలోనూ జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
More Stories
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వచ్చే వారం భారత్ లో పర్యటన
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు
విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక