భారతదేశపు మొదటి గిర్‌ జాతి క్లోనింగ్‌ ఆవుదూడ గంగతో రాష్ట్రపతి

భారతదేశపు మొదటి గిర్‌ జాతి క్లోనింగ్‌ ఆవుదూడ గంగతో రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలో ఓ ఆవుదూడను చూడటానికి వెళ్లారు. ఆ ఆవుదూడ తల, ఒళ్లు నిమురుతూ కాసేపు అక్కడే గడిపారు. దేశంలో చాలా ఆవుదూడలుంటాయి కదా. రాష్ట్రపతి ముర్ము కేవలం ఆ ఆవుదూడకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారనే కదా మీ సందేహం.
ఎందుకంటే మిగతా ఆవుదూడల కంటే ఆ ఆవు దూడ చాలా భిన్నమైనది.
అన్ని ఆవు లేగల్లా దానిది సహజ జననం కాదు. శాస్త్రవేత్తలు క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా ఆ ఆవులేగను సృష్టించారు.  శాస్త్రవేత్తలు దేశంలోనే మొదటిసారిగా ఒక గిర్‌ జాతి ఆవుదూడను క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా సృష్టించారు. హర్యానాలోని నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్ డి ఆర్ ఐ)లో ఈ ఏడాది మార్చి 16న ఈ గిర్‌ జాతి ఆవుదూడ జన్మించింది.
ఈ క్లోనింగ్‌ ఆవుదూడ పుట్టినప్పుడే 32 కిలోల బరువు ఉంది. సాధారణంగా ఈ గిర్‌ జాతి ఆవులు శ్రేష్ఠమైన పాలు ఇస్తాయి. ఆ పాల నాణ్యతను, దిగుబడిని మరింత పెంచడమే లక్ష్యంగా కొత్త లక్షణాలను చొప్పిస్తూ క్లోనింగ్ లేగదూడను సృస్టించారు.కాగా, ఎన్ డి ఆర్ ఐ గతంలో కూడా పలు పరిశోధనలు చేసింది. 2009లో ప్రపంచంలోనే తొలి బర్రె దూడను సృష్టించిన ఘనత కూడా  ఎన్ డి ఆర్ ఐ పేరిట ఉన్నది.
కాగా  ఎన్ డి ఆర్ ఐ తాజాగా సృష్టించిన ఈ క్లోనింగ్ ఆవుదూడకు శాస్త్రవేత్తలు గంగ అని పేరుపెట్టారు. గంగకు అంత ప్రత్యేకత ఉన్నది కాబట్టే రాష్ట్రపతి ముర్ము ప్రత్యేకించి ఆ లేగ దూడను చూడటానికి ఎన్ డి ఆర్ ఐ కి వెళ్లారు.