20 ఏండ్ల కనిష్ఠానికి పడిపోయిన వరి ఉత్పత్తి

20 ఏండ్ల కనిష్ఠానికి పడిపోయిన వరి ఉత్పత్తి
ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పిత్తి 20 ఏండ్ల కనిష్ఠానికి పడిపోయినట్టు ఫిచ్‌ సొల్యూషన్‌ తన సర్వేలో వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకు రాగలదని, ఆహారధాన్యాల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2003 తర్వాత బియ్యం ఉత్పత్తిలో ఇదే అతిపెద్ద సంక్షోభమని పేర్కొన్నది.
 
అప్పుడు 18.6 మిలియన్‌ టన్నుల కొరత ఉండగా, ప్రస్తుతం 8.7 మిలియన్‌ టన్నుల కొరతకు దారితీసిందని తెలిపింది. చైనా, పాకిస్థాన్‌ వంటి వరి ప్రధాన దేశాల్లో కరువు, ప్రతికూల వాతావరణం కారణంగా బియ్యం ఉత్పత్తి భారీగా పడిపోయినట్టు తెలిపింది. వీటితో పాటు అమెరికా, యూరప్‌లోనూ ఉత్పత్తి పడిపోయినట్టు పేర్కొన్నది.
 
ఉక్రెయిన్‌ యుద్ధం కూడా బియ్యం ఉత్పత్తి పడిపోవడానికి ఒక కారణంగా తేల్చింది. పాకిస్థాన్‌లో అకాల వర్షాలు, వరదల కారణంగా 31 శాతం ఉత్పత్తి తగ్గినట్టు తెలిపింది. చైనాతో పాటు ఫ్రాన్స్‌, జర్మనీ, రష్యాలో గత 20 ఏండ్లలో ఎప్పుడూ లేనంత కరువు ఏర్పడినట్టు తెలిపింది. దీంతో ఆయా దేశాల్లో వరి సాగు తగ్గి బియ్యం ఉత్పత్తి పడిపోయినట్టు వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి పడిపోవడంతో ధరలపై ప్రభావం చూపుతుందని ఫిచ్‌ సొల్యూషన్‌ సర్వే నివేదిక పేర్కొన్నది. బియ్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఇదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 350 కోట్ల మంది పేదలపై ఈ ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే వచ్చే ఏడాది ఇది సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. కాగా, వచ్చే సీజన్‌లో మనదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు ఉండడంతో దేశంలోనూ వరి, గోధుమ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని సర్వే నివేదికలో వెల్లడైంది.

అయితే,  తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నది. ఈ ఏడాది వరిసాగు పెరగడంతో బియ్యం కొరతను అధిగమించనున్నది. నిరుడు 98 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈ ఏడు ఏకంగా 1.21 కోట్ల ఎకరాల్లో సాగైంది. ఈ ఒక్క ఏడాదిలోనే 23 లక్షల ఎకరాల్లో వరిసాగు పెరగడం గమనార్హం. దీనికి తగ్గట్టుగానే ధాన్యం ఉత్పత్తి పెరగనున్నది.