విశాఖ స్టీల్ బీడ్ అంతా కేసీఆర్ మోసపు ఎత్తుగడ 

విశాఖ స్టీల్ బీడ్ అంతా కేసీఆర్ మోసపు ఎత్తుగడ 

విశాఖపట్టణంలోని స్టీల్ ప్లాన్ ను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రైవేటు వారికి అమ్ముతుంటే, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం అడ్డుపడి, దానిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రైవేట్ పరం కాకుండా చేయబోతున్నట్లు బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటున్నారు. అందుకోసం తెలంగాణలోని సింగరేణి కాలరీ్‌సకు చెందిన అధికారుల బృందం మంగళవారం విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి హడావుడి చేసింది.

అయితే, వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు. కేవలం ముడి పదార్థాలు లేదా మూలధనం సమకూర్చేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ప్రకటన మాత్రమే చేసింది. ఈ బీడ్ లో పాల్గొంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దక్కే ఆస్కారం ఏమాత్రం లేదు.  సిర్పూర్ పేపర్ మిల్లు, ఆజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా  బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది.

కేవలం కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం మినహా స్టీల్ ప్లాంట్ అమ్మకపు పక్రియ ప్రారంభించడమే జరగలేదు. ప్రారంభించినా ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి కష్టపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి దానిని కొనుగోలు చేసే స్తోమతు గాని, ఆర్ధిక వెసులుబాటు గాని లేదు. అసలు ప్రస్తుతం బీడ్ దాఖలు చేసే అర్హత కూడా తెలంగాణ ప్రభుత్వంకు లేదు.

వీటన్నటినికి మించి, కేసీఆర్ ప్రభుత్వంకు కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా పెట్టుబడుల ఉపసంహరణలు పాల్గొనే అవకాశం లేదు. 2022 ఏప్రిల్ 19న ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఉత్తరువును జారీ చేసింది. వ్యూహాత్మక రంగాలలోని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి రంగాలలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవికూడా పాల్గొనరాదని ఈ ఉత్తరువు స్పష్టం చేసింది.

ఇదంతా చూస్తుంటే, అసలు కొనుగోలు చేసే అధికారం గాని, అధికారం గాని వెసులుబాటు లేకపోగా, అసలు అమ్మకపు పక్రియ ప్రారంభం కాకుండానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయడానికి యత్నిస్తుంటే, దానిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణా సీఎం కేసీఆర్‌ సింగరేణి కాలరీ్‌సతో బిడ్‌ వేయిస్తున్నారని ప్రచారం చేసుకోవడం అంతా ప్రజలను వెఱ్ఱివారిని చేయడం కోసమే అని చెప్పాలి.

వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకు, ప్రైవేటీకరణకు సంబంధం లేదు. ‘ముడిపదార్థాల సరఫరా లేదా వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చితే… దానికి సమానమైన విలువగల స్టీల్‌ ఇస్తాం! ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రండి’ అని విశాఖ స్టీల్స్‌ ‘ఆసక్తి వ్యక్తీకరణ’ (ఈవోఐ) ప్రకటన జారీ చేసింది. అంతే తప్ప ఇది స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి కానే కాదు.

విశాఖ ఉక్కులో ‘కావేరి’ పేరుతో ఉన్న బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఏడాదిన్నర కాలంగా మూతపడి ఉంది. ముడి పదార్థాలకు అవసరమైన నిధులు లేక దానిని మూసేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మిగిలిన రెండు బ్లాస్ట్‌ ఫర్నే్‌సలు నడిపేందుకు అవసరమైన ముడిపదార్థాలూ సమీకరించలేని దుస్థితి ఏర్పడింది.

అన్ని దారులూ మూసుకుపోవడంతో విశాఖ ఉక్కు యాజమాన్యం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ‘‘ఎవరైనా ముడి పదార్థాలు సరఫరా చేస్తే… దానికి బదులుగా తయారుచేసిన స్టీల్‌ని ఇస్తాం’’ అంటూ గత నెలలో ఈవోఐ జారీ చేసింది. తనకు అవసరమైన వనరులను సొంతంగా సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘‘వర్కింగ్‌ క్యాపిటల్‌ లేదా ముడి పదార్థాలు సరఫరా చేస్తే.. దానికి బదులుగా స్టీల్‌ ఇస్తాం’’ అంటూ గతనెల 27వ తేదీన విశాఖ ఉక్కు యాజమాన్యం ఈవోఐ వెలువరించింది. ఇందులో… ‘‘ఉక్కు, ఉక్కు ఉత్పత్తికి సంబంధించిన కంపెనీలతో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాం’’ అని తెలిపింది.

స్టీల్‌ తయారీ సంస్థలతో అనుబంధం, అనుభవం ఉన్నవారెవరైనా బిడ్‌ వేయవచ్చునని స్పష్టం చేసింది. ‘‘స్టీలు తయారీకి సంబంధించిన ముడిపదార్థాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ (ఉదాహరణకు కోకింగ్‌ కోల్‌/బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కోల్‌, ఇనుప ఖనిజం) సరఫరా చేసి… దానికి బదులుగా స్టీల్‌ ఉత్పత్తులను తీసుకోవచ్చు. లేదా… వర్కింగ్‌ క్యాపిటల్‌ (నగదు) సమకూర్చితే దానికి బదులుగా స్టీల్‌ ఉత్పత్తులను సరఫరా చేస్తాం’’ అని ఈవోఐలో పేర్కొన్నారు.

పైగా, ఉక్కు తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల రంగంలో ఉన్న కంపెనీలు మాత్రమే ఈవోఐకి ముందుకురావాలని ఇందులో స్పష్టంగా చెప్పారు. ఏప్రిల్‌ 15వ తేదీలోపు స్పందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వంకు అటువంటి అర్హత లేదని అందరికి తెలిసిందే. స్టీల్‌ తయారీకి ఐరన్‌ ఓర్‌, కోకింగ్‌ కోల్‌, ఫెర్రో ఎల్లాయిస్‌, డోలమైట్‌, లైమ్‌స్టోన్‌, మాంగనీస్‌, ఆక్సిజన్‌ కీలకమైన ముడి పదార్థాలు! సింగరేణి కాలరీ్‌సలో లభించే బొగ్గు కోకింగ్‌ కోల్‌/బీఎఫ్‌ కోల్‌ కాదు. అది  బాయిలర్‌ కోల్‌! అంటే… థర్మల్‌ విద్యుదుత్పత్తి ప్లాంట్లలోని బాయిలర్లలో ఉపయోగిస్తారు.

 ఒకవేళ ముడిపదార్థాల సరఫరాకు సింగరేణి ఎంపికైతే ఆ సంస్థ సరఫరా చేసే బొగ్గును విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని థర్మల్‌ ప్లాంటులో ఉపయోగించవచ్చు. దీని ద్వారా నెలకు రూ.50 కోట్ల వరకు ఆదా అవుతుంది. ఇతరత్రా ముడి పదార్థాలు సింగరేణి నేరుగా సరఫరా చేసే పరిస్థితి లేదు. ఈవోఐ నిబంధనల ప్రకారం నేరుగా వర్కింగ్‌ క్యాపిటల్‌ను కూడా అందించే అవకాశముంది. దాదాపుగా రూ.5 వేల కోట్లు అవసరం. సింగరేణి సంస్థ ఆ నిధులను సమకూర్చగలదా? అనేది అసలు ప్రశ్న!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని, బయ్యారం గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్‌ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘తెలంగాణ బొగ్గును ఆంధ్రకు దోిచి పెడతారా. బయ్యారం గనులు ఇచ్చేందుకు ఒప్పుకోం’’ అని తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్‌ ప్రభుత్వం సింగరేణి ద్వారా విశాఖ ఉక్కును కాపాడతామని చెబుతుండటం ఎవ్వరిని మోసం చేయడానికి?