కర్ణాటక బీజేపీ ఎన్నికల ప్రచారంలో ‘నాటు నాటు’ పాట

కర్ణాటక బీజేపీ ఎన్నికల ప్రచారంలో ‘నాటు నాటు’ పాట
తెలుగు వారి కీర్తిని అంతర్జాతీయంగా మారుమ్రోగించి, మొదటిసారిగా ఆస్కార్ అవార్డు పొందిన సంచలన సినిమా ఆర్ఆర్ఆర్ లోని `నాటు.. నాటు..’ పాట ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమ్రోగిపోతుంది.  కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావడం కోసం పట్టుదలతో ప్రచారంలో అందరికన్నా ముందున్న బిజెపి సహితం ఈ పాటను తన ఎన్నికల ప్రచారంలో కీలకంగా మార్చుకుంది. అందుకు ముఖ్యంగా యువత నుండి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది.

ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఛర్మిష్మాను కేంద్రంగానే ప్రచారం ముమ్మరం చేస్తోంది.  ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డలతో పాటు పలువురు కీలక నేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు జరుపుతున్నారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 

ఇదిలా ఉంటే.. ట్రిపుల్ ఆర్ సినిమా అంతర్జాతీయంగా ఎలాంటి అద్భుతాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిందీ మూవీ. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి ఆస్కార్‌ అందుకున్న చిత్రంగా ట్రిపులార్‌ నిలిచింది. ఇందులోని ‘నాటు నాటు’ పాటకు ప్రపంచమే ఫిదా అయ్యింది. 

ఈ పాట కర్ణాటక ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న  నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన ‘నాటు నాటు’ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కొంతమంది యువకులు డ్యాన్స్‌ చేస్తున్న పాట నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కర్ణాటకకు మోదీ  ప్రభుత్వం ఇచ్చిన, ప్రాజెక్టులు, పథకాల పేర్లను ఈ పాటలో ప్రస్తావించారు.  శివ‌మొగ్గ ఎయిర్ పోర్ట్ , బెంగ‌ళూరు మైసూర్ ఎక్స్ ప్రెస్ వే, మెట్రో లైన్‌లను వివరిస్తూ సాంగ్ లిరిక్స్‌ ఉన్నాయి. దీంతో ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలోను షేక్‌ చేస్తోంది.