బీజేపీ తరఫున కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ప్రచారం

కన్నడ నాట స్టార్ హీరోగా గుర్తింపు పొందిన కిచ్చా సుదీప్‌ కర్ణాటక ఎన్నికలలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి అతడు బీజేపీలో చేరబోతున్నాడని, ఎన్నికల బరిలో దిగుతున్నాడని ప్రచారం జరిగింది.అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొంటున్నట్లు బుధవారం స్పష్టత ఇచ్చారు.
 
సీఎం బొమ్మై, కిచ్చా సుదీప్ కలిసి బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ మాట్లాడుతూ  తాను బొమ్మై సార్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను తాను గౌరవిస్తానన్న ఆయన దానికి తాను ఈ రోజు ఇక్కడికి రావడానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
 
బొమ్మైతో తనకున్న అనుబంధంతోటే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదని, కేవలం బీజేపీకి మద్దతు ప్రకటించి ప్రచారం చేయడానికే వచ్చానని పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతం తనకు నచ్చుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
 
“నేను 27 ఏళ్ల కిందట సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్న సమయంలో మామ (బసవరాజ బొమ్మై) నాకు అండగా నిలిచారు. కష్టకాలంలో ఆదుకున్నారు. అదే సమయంలో ఆయన కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు నేను ఆయనకు అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. నా పూర్తి సామర్థ్యం మేరకు ఆ పని చేస్తాను” అని సుదీప్ ప్రకటించారు. తాను బీజేపీ తరఫున ప్రచారం చేయడంపై తన అభిమానులు కూడా తనకు అండగా ఉంటారని నమ్ముతున్నట్లు తెలిపారు.
 
అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడుతూ సుదీప్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని తెలిపారు. ఆయన తనకు మద్దతు ప్రకటించారని, తనకు మద్దతు ఇవ్వడం అంటే, బీజేపీకి మద్దతునివ్వడమేనని స్పష్టం చేశారు.  నటుడు కిచ్చా సుదీప్‌ మద్దతు తమకు మరింత శక్తినిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో తాము మరోసారి అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారుకు ప్రజలు బీజేపీకే పట్టం కడతారని బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరోగా సుదీప్ నటించిన కన్నడ, తెలుగు, హిందీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కిచ్చా, నాంది, స్పర్శ తదితర సినిమాలు తీశారు. దర్శకుడిగా మై ఆటోగ్రాఫ్ సినిమా తీశారు. కెంపెగౌడ, మాణిక్య తదితర హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ఈగ సినిమాలో సుదీప్ విలన్‌గా నటించారు. సుదీప్ బుల్లితెరపైన కూడా మెరుస్తున్నారు. అనేక రియాల్టీ షోలకు హోస్ట్‌గా ఉన్నారు.