
మూడు రాష్ట్రాల్లోని జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ రహదారులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలోని పలు పట్టణాలను కలిపేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) శ్రీకారం చుట్టింది.
నాలుగు లేన్లుగా నిర్మించే ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ రూపకల్పనలో భాగంగా అధికారులు సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేయగా త్వరలోనే సంబంధిత పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మూడు రాష్ట్ర్రాల్లోని ప్రతిపాదిన రహదారుల నిర్మాణానికి రూ.5041 కోట్లు వ్యయం కాగలదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద మంచిర్యాల నుంచి వరంగల్, వరంగల్ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి విజయవాడ వరకు మూడు భాగాలుగా ఈ రహదారుల నిర్మాణం పనులు సాగనున్నాయి. మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 112 కి.మీ.గా గుర్తించిన అధికారులు దానిని మూడు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం పనులు చేపట్టనున్నారు.
అలాగే, మహారాష్ట్ర్రలోని నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే 363 జాతీయ రహదారిని శ్రీరాంపూర్ వద్ద అనుసంధానం చేస్తారు. అది వరంగల్, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ వరకు వెళ్లనుంది. మరోవైపు, నిజామాబాద్ నుంచి జగ్దల్‌పూర్ వెళ్లే రహదారికి అనుసంధానం కానుంది. దీని ద్వారా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర్రలకు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.
మంచిర్యాల జిల్లాలో ప్రారంభమయ్యే రహదారి మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర, వరంగల్ వరకు ఉంటుంది. తిరిగి అక్కడి నుంచి మహబూబాబాద్, ఉరవకొండ, గీసుకొండ, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం, ఖమ్మం వరకు ఉంటుంది. ఖమ్మం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా తునికిపాడు, సిరిపురం, జమిడిచర్ల, దుగ్గిరాలపాడు, నెక్కెంపాడు మీదుగా ఈ రహదారి విజయవాడ వెళ్లనుంది.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!