రాజ‌గోపాల్ రెడ్డికి 2+2 భద్రత ఏర్పాటు చేయాలి

రాజ‌గోపాల్ రెడ్డికి 2+2 భద్రత ఏర్పాటు చేయాలి
బీజేపీ నేత‌, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భద్రత కల్పించాలని  తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో 2+2 భద్రత ఏర్పాటు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. డీజీపీకి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పించాలని పేర్కొంటూ  పోలీసులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ  హైకోర్టులో ఆయన  పిటీషన్ వేశారు. గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలలో హోరాహోరీగా అధికార పార్టీతో బిజెపి అభ్యర్థిగా పోరాడారు.
 
అయినప్పటికీ ఆయన మునుగోడు ఉప ఎన్నికలో పరాజయం పాలయ్యారు. మునుగోడు బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10,000 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. అధికార దుర్వినియోగంతో బీఆర్ఎస్ విజయం సాధించిందని, నైతిక విజయం తనదేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడు సంచలన ఆరోపణలు చేశారు.

 
ఇక ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. మునుగోడులో ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పై తనదైన శైలిలో పోస్టులు పెడుతూ అటు ప్రభుత్వాన్ని, మంత్రి కేటీఆర్ ను నిలదీస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
 
ఈ క్రమంలో తాజాగా ఆయన తనకు ప్రాణహాని ఉందని కోర్టు మెట్లు ఎక్కడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తుంది ఎవరు? అని అంతా చర్చిస్తున్నారు.