ముందస్తు ఎన్నికలను కొట్టిపారవేసిన జగన్

ముందస్తు ఎన్నికలు, క్యాబినెట్ విస్తరణ ఊహాగానాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముగింపు పలికారు. అవన్నీ ఊహాగానాలేనని తేల్చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజక వర్గాల ఇంఛార్జిలతో సిఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఉపదేశాన్ని మంత్రి జోగి రమేష్ మీడియాకు వివరించారు. 

ఏపీలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2024లోనే జరుగుతాయని కూడా తెలిపారు. 60 మంది ఎమ్మెల్యేలను మార్చుతున్నట్లు వార్తలను సైతం జగన్ ఖండించారని.. అందరినీ గెలిపించుకునే బాధ్యత పార్టీపై ఉందన్నారాయన. ఒక్క ఎమ్మెల్యేను కూడా వదులుకోం.. అందర్నీ గెలిపించుకుంటాం అని స్పష్టంచేసినట్లు వివరించారాయన. 

నాలుగు ఎమ్మెల్సీల ఓటమిపై జగన్ స్పందిస్తూ వాపును చూసి బలుపు అని టీడీపీ భావిస్తుందని, తప్పుడు వార్తలతో నిజాన్ని సమాధి చేయాలని చూస్తున్నారంటూ జగన్ ఎద్దేవా చేశారు.  గడప గడపకు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెబుతూ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నట్లు వెల్లడించారు.

2024 ఎన్నికల్లో గెలిచే బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందని పేర్కొంటూ గెలిచి తీరాల్సిన అవసరం ఉందని జగన్ హెచ్చరించారు. ప్రతి ఎమ్మెల్యే సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలని, ఇంటింటికీ వెళ్లటంతోపాటు నిరంతరం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని హితబోధ చేశారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, రీజినల్ ఇంఛార్జులు మళ్లీ గడపగడపకు కార్యక్రమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.  సోషల్ మీడియాలో క్యాంపెయిన్‍ను ఉధృతం చేసుకోవాలని చెప్పారు.

ప్రతి లబ్దిదారును ప్రచారకర్తగా తయారు చేసుకోవాలని చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చామని వివరించారు.

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రజలకు వివరించేందుకు 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, కోడ్ కారణంగా నెమ్మదించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నెలకు కనీసం 25 రోజులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారని సిఎం ఎమ్మెల్యేలకు చెబుతూ మారీచులతో యుద్ధం చేస్తున్నామని, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారని హెచ్చరించారు.