
ఇండోర్ నగరంలోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి పైకప్పు కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 35కు పెరిగింది. శ్రీరామనవమి సందర్భంగా బాలేశ్వర్ ఆలయంలో భక్తులు పూజలు చేస్తుండగా బావి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మంది మృతదేహాలను బావి నుంచి వెలికి తీశారు. ఈ దుర్ఘటనలో మరో 18మందిని రక్షించారు. గాయపడిన 16 మందికి చిత్స అందిస్తున్నామని ఇండోర్ డివిజన్ పోలీసు కమిషనర్ పవన్ శర్మ చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిస్థితిని పరిశీలించి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇండోర్‌లో జరిగిన దుర్ఘటన చాలా బాధ కలిగించిందని మోదీ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బావిపై ఆలయ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారో కూడా కనుగొనాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.ఇండోర్ ఆలయంలో జరిగిన దుర్ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
పలు రాష్ట్రాల్లో అపశృతులు
కాగా, శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రల్లో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో కూడా శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు రాళ్లు, పెట్రోలు నింపిన సీసాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు సహా 15 మంది గాయపడ్డారు. దాదాపు 500 మంది పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.
గుజరాత్ లోని వదోదరలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రెండు వర్గాలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. శోభాయాత్ర ఊరేగింపు ఒక మసీదుకు సమీపంలోకి వచ్చిన సమయంలో ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఇరు వర్గాలు మొదట నినాదాలతో ప్రారంభించి, తర్వాత రాళ్లు రువ్వుకున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో శ్రీరామ నవమి ఊరేగింపులో గొడవ జరిగింది. రెండు వర్గాల మధ్య ప్రారంభమైన వివాదం తీవ్రమై వాహనాలను తగలబెట్టే వరకు వెళ్లింది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్