
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో రామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పటేల్ నగర్ పరిసరాల్లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామ నవమి శుభ సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మెట్ల బావి పైకప్పు కూలి 30 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు.
ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను కాపాడాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 13మంది మరణించగా.. మరికొంత మందిని అధికారులు రక్షించారు.
ఆలయంలో గురువారం రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థలం లేక కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చున్నారు. ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 25 మంది భక్తులు అందులో పడిపోయారు
ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో ప్రధాని మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.
ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఇండోర్ జిల్లా కలెక్టర్, కమిషనర్‌ను ఆదేశించారు. “ఇది దురదృష్టకర సంఘటన. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇతర వ్యక్తులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని సీఎం చౌహాన్‌ను పేర్కొన్నారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్