ఫిలిప్పీన్స్ లో భారతీయ దంపతుల దారుణ హత్య

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో భారతీయ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు వారిపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపి పారిపోయాడు. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన 41 సంవత్సరాల వయస్సున్న సుఖ్వీందర్ సింగ్, 33 ఏళ్ల వయస్సున్న ఆయన భార్య కిరణ్ దీప్ కౌర్ లను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు.
 
సుఖ్వీందర్ సింగ్ గత 20 ఏళ్లుగా ఫిలిప్పైన్స్ లోని మనీలాలో ఉంటున్నారు. స్వంతంగా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు. ఆయనకు మూడేళ్ల క్రితం కిరణ్ దీప్ కౌర్ తో వివాహమైంది. సుమారు 6 నెలల క్రితం ఆమె కూడా ఫిలిప్పైన్స్ కు వెళ్లారు. వీరిద్దరి కుటుంబాలు జలంధర్ సమీపంలోని మెహసంపూర్ గ్రామంలో ఉంటున్నాయి.

సుఖ్విందర్ సింగ్ సోదరుడు లఖ్విర్ సింగ్ కూడా మనీలాలో సుఖ్వీందర్ సింగ్ తో పాటే ఉంటారు. కానీ, ఒక శుభకార్యానికి హాజరుకావడం కోసం ఆయన ఇటీవలనే భారత్ కు వచ్చాడు. తన సోదరుడు సుఖ్వీందర్ మరణ వార్త సోమవారం తమకు తెలిసిందని ఆయన వెల్లడించారు. ఆదివారం నుంచి సుఖ్వీందర్ కు ఫోన్ చేస్తున్నామని, ఆయన రెస్పాండ్ కాలేదని, దాంతో, మనీలా తమ నివాసానికి దగ్గర్లో ఉండే తమ అంకుల్ కు విషయం చెప్పి ఇంటికి వెళ్లి చూడమని చెప్పామని లఖ్వీర్ వివరించారు.

తమ అంకుల్ అక్కడికి వెళ్లి చూడగా, రక్తపు మడుగులో సుఖ్వీందర్, కిరణ్ దీప్ కనిపించారని, దాంతో, వెంటనే ఆయన స్థానిక పోలీసులకు, తమకు సమాచారమిచ్చారని వివరించారు. తమకు మనీలాలో శత్రువులు ఎవరూ లేరని తెలిపారు. సుఖ్వీందర్ సింగ్  దంపతుల హత్యపై మనీలాలో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుఖ్వీందర్ ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని తనిఖీ చేశారు.

 
శనివారం రాత్రి విధులు ముగించుకుని సుఖ్విందర్ ఇంటికి వచ్చిన తరువాత, కాసేపటికి బైక్ పై మరో వ్యక్తి వారి ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి సుఖ్వీందర్, ఆయన భార్య కిరణ్ దీప్ పై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోయినట్లుగా గుర్తించారు. ఆ దుండగుడి కోసం గాలింపు జరుపుతున్నారు.