అమెరికా విదేశాంగ శాఖ ప్ర‌తినిధిగా వేదాంత ప‌టేల్

అమెరికా విదేశాంగ శాఖ ప్ర‌తినిధిగా వేదాంత ప‌టేల్
అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్ర‌తినిధిగా వేదాంత పటేల్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో తాత్కాలికంగా ప్ర‌తినిధిగా ఆయ‌న కొన‌సాగ‌నున్నారు. ఆ శాఖ అధికార ప్ర‌తినిధి నెడ్ ప్రైజ్ఈ నెల‌లో రిటైర్ కానున్న నేప‌థ్యంలో భార‌తీయ సంత‌తికి చెందిన వేదాంత ప‌టేల్‌కు ఆ అవ‌కాశం ద‌క్కింది.
 
తాత్కాలిక ప్ర‌తినిధిగా వేదాంత ప‌టేల్ ప‌నిచేస్తార‌ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.  విదేశాంగ శాఖ‌లో ఆంటోనీ బ్లింకెన్ వ‌ద్ద నెడ్ ప్రైస్ నేరుగా ప‌నిచేయ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 2021 జ‌న‌వ‌రి 20వ తేదీ ఆ శాఖ‌లో అధికార ప్ర‌తినిధిగా నెడ్ ప్రైస్ చేరారు.
 నెడ్ ప్రైస్ త‌న శాఖ త‌ర‌పున దాదాపు 200కు పైగా బ్రీఫింగ్స్‌ను నిర్వ‌హించిన‌ట్లు బ్లింకెన్ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
నెడ్ ప్రైస్ స్థానంలో ఇంచార్జిగా వ‌స్తున్న వేదాంత ప‌టేల్ ఆ బాధ్య‌త‌ల్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. భారత దేశంలో పుట్టిన ప‌టేల్‌ కాలిఫోర్నియాలో పెరిగారు.  యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాతో పాటు యూనివ‌ర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఆయ‌న గ్రాడ్యుయేట్ అయ్యారు. గ‌తంలో అధ్య‌క్షుడు బైడెన్‌కు అసిస్టెంట్ ప్రెస్ సెక్ర‌ట‌రీ, ప్ర‌తినిధిగా ప‌టేల్ చేశారు. మీడియా రిలేష‌న్స్‌, క‌మ్యూనికేష‌న్ స్ట్రాట‌జీలో ప‌టేల్ త‌న స్కిల్స్‌ను పెంచుకున్నారు.
 
భారత్ – పాక్ సంప్రదింపులకు మద్దతు
 
ఇలా ఉండగా, భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య నిర్మాణాత్మ‌క చ‌ర్చ‌లు, అర్ధ‌వంత‌మైన సంప్ర‌దింపులు జ‌రిగేందుకు అమెరికా మ‌ద్ద‌తిస్తుంద‌ని ఆ దేశ విదేశాంగ ప్ర‌తినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. అయితే, చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌పై భార‌త్‌, పాకిస్తాన్‌లే ఓ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని ప్రైస్ స్ప‌ష్టం చేశారు. ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల కోసం తాము మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌బోమ‌ని కూడా తేల్చి చెప్పారు.
 
భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య దీర్ఘ‌కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న అంశాల‌ను చ‌ర్చ‌ల ద్వారా ఇరుదేశాలు ప‌రిష్క‌రించుకునేలా సంప్ర‌దింపుల‌కు అమెరికా మ‌ద్ద‌తిస్తుంద‌ని తెలిపారు. ఏరూపంలోనైనా భారత్‌-పాకిస్తాన్ మ‌ధ్య చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌కు తాము బాస‌ట‌గా నిలుస్తామ‌ని చెప్పారు.  చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌కు ఇరు దేశాలు స‌మ్మ‌తించి ముందుకొస్తే ఇరు దేశాల భాగ‌స్వామిగా త‌మ వంతు పాత్ర పోషించేందుకు బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తామ‌ని తెలిపారు. కానీ, చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌కు విధివిధానాల్లో అమెరికా పాత్ర ఉండ‌బోద‌ని అన్నారు.