జర్మనీలోని హాంబర్గ్ సిటీలోగల చర్చిలో ఓ ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటలకు ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. గ్రాస్బోర్స్టెల్ జిల్లాలోని డీల్బోజ్ వీధిలోగల మూడంతస్తుల చర్చి భవనంలో (యెహోవా విట్నెస్ సెంటర్) ఓ దుండగుడు చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు.
దుండగుడు భవనం నుంచి బయటికి పారిపోయినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని, కాబట్టి కాల్పుల అనంతరం దుండుగుడు తనను కాల్చుకుని మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం చర్చి భవనాన్ని చుట్టుముట్టిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
పరసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చర్చి చుట్టుపక్కల నివాసితులు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరికలు చేశారు. మరోవైపు ఘటనా ప్రాంతానికే వైద్య సిబ్బందిని రప్పించి క్షతగాత్రులకు అత్యవసర చికిత్స చేయిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

More Stories
అమెరికాలో ప్రతిభావంతులు లేరు.. విదేశీ ప్రతిభ అవసరమే
పాక్ కోర్టు ఆవరణలో భారీ పేలుడు.. 12 మంది మృతి
కొత్త హరిత ఆర్ధిక వ్యవస్థలో అభివృద్ధి చెందిన దేశాలువెనకడుగు?