రాజాసింగ్ పై క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ కొట్టివేత

రాజాసింగ్ పై క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ కొట్టివేత
బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఉపశమనం లభించింది. పోలీసులు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గత ఏడాది రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. మొదట రాజాసింగ్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. రిమాండ్ తిరస్కరణపై క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను పోలీసులు వేశారు.
 
పోలీసుల రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తాజాగా తీర్పు వెలవరించింది. దీంతో రాజాసింగ్‌కు ఊరట లభించినట్లు అయింది. ఈ కేసులో రాజా సింగ్ తరుపున న్యాయవాది కరుణా సాగర్ హైకోర్టులో వాదనాలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం పోలీసుల రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
 
రిమాండ్‌ను తిరస్కరిస్తూ నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ తాజాగా తీర్పునిచ్చింది.  గత ఏడాది ఆగష్టు 23న  రాజాసింగ్‌ను రిమాండ్‌లోకి ఇవ్వడానికి నాంపల్లి కోర్టు అంగీకరించలేదు. వివాదాస్పద, విద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల అల్లర్లు జరిగే అవకాశముందని, అందుకే రిమాండ్‌లో ఇవ్వాలని పోలీసులు కోరారు.
 
కానీ అరెస్ట్ చేసేటప్పుడు 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించారంటూ నాంపల్లి కోర్టు తెలిపింది. అందుకే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఎమ్మెల్యే రాజాసింగ్ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టారంటూ ఐపీసీ సెక్షన్ 153(ఎ) కింద గతంలో  కేసు నమోదు చేశారు.
 
అలాగే మత విశ్వాసాలను కించపర్చినందుకు సెక్షన్ 295- ఎ కింద కేసు..  ప్రకటనల ద్వారా నష్టం కలిగించినందుకు సెక్షన్ 295- ఎ బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇవన్నీ బెయిలబుల్ కేసులే నంటూ రాజాసింగ్ న్యాయవాది వాదించగా.. కోర్టు అంగీకరించి బెయిల్ మంజూరు చేసింది.  ఆ తర్వాత రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేయగా ఈ కేసులో కొన్ని నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు.