ప్రతి బడ్జెట్ గ్రామాల, పేదల, రైతుల బడ్జెట్

ప్రతి బడ్జెట్ గ్రామాల, పేదల, రైతుల బడ్జెట్

2014లో వ్యవసాయ బడ్జెట్ రూ. 25,000 కోట్ల లోపు ఉండగా ఇప్పుడు అది ఐదు రెట్లు పెరిగి రూ. లక్షా 25 వేల కోట్లకు చేరిందని గుర్చేస్తూ ఇటీవలి కాలపు ప్రతి బడ్జెట్ ను గ్రామాల, పేదల, రైతుల బడ్జెట్ అంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

2023 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన అనేక నిర్ణయాలు సమర్థంగా అమలు చేయటానికి వీలుగా ఆలోచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం చేపట్టిన 12 బడ్జెట్ అనంతర వెబినార్ సిరీస్ లో భాగంగా  వ్యవసాయం, సహకార రంగాల మీద జరిగిన బడ్జెట్ అనంతర వెబినార్ లో మాట్లాడుతూ  ఈ ఏడాదితో బాటు గడిచిన 8-9 సంవత్సరాల బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని  ప్రత్యేకంగా ప్రస్తావించారు.

వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సవాళ్ళకు పరిష్కారం లభించేదాకా సంపూర్ణ అభివృద్ధి లక్ష్యాన్ని సాధించలేమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగ నవకల్పనలు,  పెట్టుబడులు ఈ రంగానికి దూరంగా ఉండటం వలన దేశ యువత మిగతా రంగాలతో పోల్చినప్పుడు వ్యవసాయ రంగంలో పాల్గొనటం లేదని చెప్పారు.  ఈ శూన్యాన్ని భర్తీ చేయటానికి ఈ సంవత్సరం బడ్జెట్లో చాలా ప్రోత్సాహకాలు ప్రకటించామని ప్రధాని పేర్కొన్నారు.

యూపీఐ ఓపెన్ ప్లాట్ ఫామ్ తో పోల్చి చెబుతూ, వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్లాట్ ఫామ్ వలన అగ్రి టెక్ లో  పెట్టుబడులు, నవకల్పనల అవకాశాలు మెరుగుపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.  రవాణా సౌకర్యాల మెరుగుదల, పెద్ద మార్కెట్లు అందుబాటులోకి రావటం, టెక్నాలజీ ద్వారా బిందు సేద్యాన్ని ప్రోత్సహించటం, మెడికల్ లాబ్స్ తరహాలోనే భూసార పరీక్షలకు లాబ్స్ ఏర్పాటు చేయటం లాంటి అవకాశాలను ప్రధాని చెప్పుకొచ్చారు.

యువత తమ నవకల్పనల గురించి చెబుతూ ప్రభుత్వానికీ, రైతులకూ మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.  దీనివలన ప్రభుత్వ విధాన నిర్ణయాలు సులువవుతాయని చెప్పారు.  వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేయటానికి, అదే సమయంలో డ్రోన్ల ద్వారా పంటను అంచనావేయటానికి కృషి జరగాలని సూచించారు.

వ్యవసాయ అంకుర సంస్థలకు ప్రోత్సాహక నిధులు సమకూర్చటాన్ని ప్రధాని గుర్తు చేశారు. కేవలం డిజిటల్ మౌలిక వసతులు కల్పించి చేతులు దులుపుకోవటం కాకుండా ప్రభుత్వం నిధుల అందజేత మార్గాలు కూడా పరిశీలిస్తోందని ప్రధాని తెలిపారు.  యువత, వ్యాపార దక్షత ఉన్న యువ ఔత్సాహికులు తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ళ కిందట ఏమీలేని వ్యవసాయ అంకుర సంస్థలు ఇప్పుడు 3000 కు చేరాయని పేర్కొన్నారు.

ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ, ఈ గుర్తింపు ద్వారా భారత రైతులకు అంతర్జాతీయ మార్కెట్ల ప్రవేశానికి తలుపులు తెరచినట్టయిందని చెప్పారు. దేశం ఇప్పుడు ముతక ధాన్యాలను ‘శ్రీ అన్న’ గా  గుర్తించిందని వీటి సాగు చిన్న రైతులకు ప్రోత్సాహంగా మారబోతోందని చెబుతూ, ఈ రంగంలో కూడా అంకుర సంస్థలకు మెరుగైన అవకాశాలుంటాయని స్పష్టం చేశారు.

గతంలో మన ఆహార భద్రత కోసం విదేశాల మీద ఆధారపడటాన్ని ప్రధాని గుర్తుచేస్తూ ఇప్పటి రైతులు దేశాన్ని ఆత్మ నిర్భర్ (స్వయం సమృద్ధం) చేయటంతోబాటు ఆహార ధాన్యాలు ఎగుమతి చేయగలిగే స్థితికి వచ్చారని ప్రధాని కొనియాడారు. స్వదేశ, విదేశ మార్కెట్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావటానికి ప్రభుత్వం చేసిన కృషి ఫలితమే ఇదని చెప్పారు. స్వయం సమృద్ధి విషయానికొచ్చినా, ఎగుమతులైనా భారతదేశం పాత్ర కేవలం వరికి, గోధుమలకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు.

దిగుమతుల గురించి ప్రస్తావిస్తూ, 2021-22 లో పప్పుధాన్యాల దిగుమతికి రూ.17 వేలకోట్లు వెచ్చించగా, విలువ జోడించిన ఆహారోత్పత్తుల దిగుమతికి రూ. 25 వేల కోట్లు, వంట నూనెల దిగుమతికి రూ. 1.5 లక్షల కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. మొత్తంగా వ్యవసాయోత్పత్తుల దిగుమతులన్నీ కలిసి రూ. 2 లక్షల కోట్లు అని ప్రధాని  చెప్పారు.