14 శాతం ఎరువుల ధరలు తగ్గించిన ఇఫ్కో !

ఎరువుల ధరలను 14 శాతం వరకు తగ్గిస్తూ ఎరువుల ఉత్పత్తి సంస్థ ఇఫ్కో  ప్రకటించింది. ఈ నిర్ణయంతో సేద్యం ఖర్చు గణనీయంగా తగ్గనుంది. ఎరువుల ధరలను 14 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఇఫ్కో ప్రతినిధి వెల్లడించారు. ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గించుకుని, ఆ మేరకు రైతులకు ప్రయోజనం అందించాలన్న ఉద్దేశంతో ఎరువుల ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 
నానో ఫర్టిలైజర్స్ తో పాటు, ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో ఉత్పత్తి ఖర్చు తగ్గిందని వివరించారు.  దేశ ఆహార భద్రతకు, ఆహార ధాన్యాల ఉత్పత్తికి, ఎరువుల లభ్యతకు మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది. రైతులకు అవసరమయ్యే కీలక ఎరువులపై ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుంది. సబ్సీడీ మొత్తాన్ని ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం అందజేస్తుంది.
 
కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ గా పిలిచే ఎన్ పీ కేలపై ఒక్కో బ్యాగ్ పై రూ. 200 నుంచి రూ. 1200 వరకు తగ్గిస్తున్నట్లు ఇఫ్కో ప్రతినిధి తెలిపారు. ఈ ధరల తగ్గింపు ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించారు.  2023 -24 సంవత్సరానికి ఎరువుల సబ్సిడీ భారం ప్రభుత్వంపై కనీసం రూ. 1.75 లక్షల కోట్లు ఉండవచ్చని ఒక అంచనా.