పోలింగ్ కు 48 గంటల ముందు సోషల్ మీడియాలోనూ ప్రచారం నిషేధం!

పోలింగ్ కు 48 గంటల ముందు సోషల్ మీడియాలోనూ ప్రచారం నిషేధం!
ఎన్నికల ప్రచారం గడువు పూర్తయిన తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలలో ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ చాలాకాలంగా నిషేధాన్ని అమలు పరుస్తుంది. అయితే, మొదటిసారిగా సోషల్ మీడియాలో ప్రచారంపై సహితం ఆంక్షలు విధించింది. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచార ఆంక్షలు సోషల్ మీడియాకు కూడా వర్తిస్తాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
 
ఈ సమయంలో ఓట్లేయాలని లేదా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ట్వీట్లు చేస్తే ఎన్నికల నియావళి ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ఈ మేరకు గురువారం బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలకు నోటీసులు జారీచేసింది. తమకు అనుకూలంగా ఓట్లు వేయాలని లేదా ఓటర్లను ప్రభావితం చేసినందుకు ఈ నోటీసులు ఇచ్చింది. త్రిపురలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్ది సేపటికే ఈసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం
ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు విస్తృతంగా ఉపయోగించుకుంటున్న సమయంలో, గతంలో మాదిరిగా బ్యానర్లు, వాల్ పోస్టర్లు, గోడ రాతలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వనపోస్తుండటం దృష్ట్యా ఈ నిషేధం ఓ విధంగా రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. 
ఫిబ్రవరి 27న నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికలు జరగనుండగా,  వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలకు ఇది స్పష్టమైన సందేశమని 48 గంటల ‘నిశ్శబ్ధ కాలం’లో ప్రచార ఆంక్షలు సోషల్ మీడియా కూడా వర్తిస్తాయని, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద పరిణామాలు ఉంటాయని ఈసీ సీనియర్ అధికారులు తెలిపారు.

వారి అధికారిక ట్విట్టర్ ఖాతాల నుంచి చేసిన ట్వీట్లు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126 (1)(బి)ని ఉల్లంఘించినట్లు గుర్తించి బీజేపీకి రెండు, కాంగ్రెస్, సీపీఎంలకు ఒక్కొక్కటి చొప్పున నోటీసులు జారీ చేసింది. దీనిపై తొందరగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126(1)(బి) ప్రకారం పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు పోలింగ్ ప్రాంతంలో సినిమాటోగ్రాఫ్, టెలివిజన్ లేదా ఎలాంటి ఉపకరణం ద్వారా అన్ని రకాల ప్రచారం, ప్రదర్శనలు నిషేధం. ఈ ఉల్లంఘనకు రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి.

ఈ ట్వీట్‌లు చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ధారించినట్లయితే ఎఫ్‌ఐఆర్‌లు నమోదచేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఆఖరి నిమిషంలో ఓటు వేయడానికి పార్టీలు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నాయని భావించి ఈసీ ఈ చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో ప్రచారంలో తప్పుడు కథనాలపై ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో తప్పుడు వార్తలపై చట్టపరమైన చర్యలకు ఆదేశించాలని ఈసీ ఇప్పటికే యోచిస్తోంది. గత ఏడాది రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా సెక్షన్ 126(1)(బి) కింద సోషల్ మీడియాలో 45 ఉల్లంఘనలు నమోదయ్యాయి. గోవాలో 29, గుజరాత్‌లో 5, హిమాచల్ ప్రదేశ్‌లో 8, పంజాబ్‌లో మూడు ఉన్నాయి. ట్విట్టర్‌లో 17, ఫేస్‌బుక్ 22, యూట్యూబ్ ఆరు మొత్తం 45 పోస్టులను తొలగించారు.