అశోకుని అంతటి ధీశాలి శ్రీకృష్ణదేవరాయలు

విజయనగర సామ్రాజ్య విస్తరణ అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయలు కీలక పాత్ర పోషించాడని, యుద్ధ తంత్రంలో అశోకుని అంతటి దీశాలి అని చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి చెప్పారు. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయల 552 వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన అరుదైన చక్రవర్తుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరని కొనియాడారు.
 
దేశంలో అత్యధిక భూభాగాన్ని పరిపాలించడమే కాకుండా ప్రజలకు మేలైన అవసరమైన పాలను అందించిన రాజుగా చరిత్రలో నిలిచిపోయారు. తాను రాజుగా పట్టాభిషేకం కాకముందు ఉన్నటువంటి వివాహ పన్ను, చేతివృత్తుల పన్ను వంటి వాటిని రద్దు చేస్తూ శాసనాలను రాయించిన ఘనత రాయలవారిదని పేర్కొన్నారు.
 
తాను చేసిన యుద్ధాల్లో పట్టుబడిన శత్రు రాజులను, శత్రు సైన్యాలను చంపకుండా అదేవిధంగా రాజ్యాన్ని ఆక్రమించకుండా వారిని సామంతులుగా చేసుకొని సరికొత్త రాజనీతిని ప్రదర్శించారని మైనాస్వామి తెలిపారు. కృష్ణదేవరాయల పాలన చేసిన వ్యవసాయ అభివృద్ధి అనుసరించిన రాజనీతి అన్నీ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే అంశాలని ఆయన చెప్పారు.