‘భయం వద్దు.. నగదు నిల్వలు ఉన్నాయి’.. ఇన్వెస్టర్లకు ఆదానీ హామీ

‘భయం వద్దు.. నగదు నిల్వలు ఉన్నాయి’.. ఇన్వెస్టర్లకు ఆదానీ హామీ

తమ గ్రూప్ లోని కంపెనీల భవిష్యత్తుపై ఆందోళన చెందనవసరం లేదని తమ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినవారికి అదానీ గ్రూప్ భరోసా ఇచ్చింది. తమ కంపెనీల వద్ద సరిపోను నగదు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది.  అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ ఆదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈ జనవరి చివర్లో నివేదిక విడుదల చేసింది. నాటి నుంచి ఆదానీ గ్రూప్ షేర్లు పాతాళంలోకి దూసుకుపోతున్నాయి.

స్టాక్ మార్కెట్ లో అత్యంత వేగవంతమైన పతనాన్ని చవి చూస్తున్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక వల్ల జరిగిన నష్టాన్ని నివారించడానికి ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ సాధ్యమైన అన్ని చర్యలు చేపట్టారు. హిండెన్ బర్గ్ నివేదిక వాస్తవాలతో కాకుండా, అబద్దాలతో రూపొందిందని ఆరోపించారు. ఇది భారత్ ప్రతిష్టను దెబ్బతీయడానికి అంతర్జాతీయంగా జరిగిన కుట్ర అని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఆదానీ గ్రూప్ ఒక ప్రకటన జారీ చేసింది. ఆదానీ గ్రూప్ కంపెనీల వద్ద సరిపోను నగదు నిల్వలు ఉన్నాయని, అప్పులను రీఫైనాన్స్ చేసుకోగల స్థాయిలో అవి ఉన్నాయని వివరించింది. వార్షిక కాంట్రాక్టులపై తమ బిజినెస్ లు నడుస్తాయని, అవసరమైన నగదు నిల్వలు ఎప్పటికప్పుడు సమకూరుతూనే ఉంటాయని, తమ బిజినెస్ లకు మార్కెట్ రిస్క్ లు చాలా తక్కువని వివరించింది.

 ఆదానీ గ్రూప్ నకు గత సంవత్సరం సెప్టెంబర్ చివరి నాటికి 27.3 బిలియన్ డాలర్ల అప్పులున్నాయి. అంటే, మన కరెన్సీలో రూ. 2.26 లక్షల కోట్లు. అలాగే, గ్రూప్ కంపెనీల క్యాష్ బ్యాలెన్స్ గత సంవత్సరం డిసెంబర్ నాటికి రూ. 316.5 బిలియన్లుగా ఉంది. హిండెన్ బర్గ్ నివేదిక వెలుగు చూసిన నాటి నుంచి ఆదానీ గ్రూప్ మార్కెట్ విలువ 125 బిలియన్ డాలర్ల వరకు తగ్గిపోయింది.