
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సి 17 గ్లోబ్‌మాస్టర్ తుర్కియే భూకంప బాధితుల కోసం 13 టన్నుల వైద్య పరికరాలు, సిరియా భూకంప బాధితుల కోసం 24 టన్నుల సహాయంతో దిగింది. భారత రాయబారి డాక్టర్ వీరేందర్ పాల్, డిఫెన్స్ అటాచ్ కల్నల్ మనుజ్ గార్గ్ అదానా విమానాశ్రయంలో టర్కీ అధికారులతో కలిసి సరుకును అందుకున్నారు.
టర్కీలోని ఇస్కెన్‌డెరున్‌లోని 60 పారా ఫీల్డ్ హాస్పిటల్ కోసం వెంటిలేటర్ యంత్రాలు, అనస్థీషియా యంత్రాలు, ఇతర వైద్య పరికరాలు, మందులను టర్కీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరఫున అంబాసిడర్ మెహ్మెట్ స్వీకరించారు.భూకంపం సంభవించిన తర్వాత భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకునేందుకు తుర్కియే వెళ్లారు.
అక్కడి శిథిలాల కింద సజీవంగా ఉన్న పలువురిని క్షేమంగా బయటకు తీసి ఆసుపత్రులకు పంపించడంలో సహకరిస్తున్నారు. కాగా, తదుపరి అందిన సమాచారం ప్రకారం ఇండియన్ ఆర్మీ ఆసుపత్రిలో ప్రతిరోజూ 400 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరికి నర్సింగ్ సేవలను అందిస్తూ త్వరగా కోలుకునేలా చేస్తున్నారు.
బాధితులకు ఉచిత విమాన టిక్కెట్లు
తుర్కియే, సిరియా సరిహద్దులో గతవారం సంభవించిన భారీ భూకంపం వల్ల వేలాది ఇండ్లు, భవనాలు, హోటళ్లు, రిసార్టులు, విద్యా సంస్థలు, హాస్టళ్లు నేలమట్టం కావడంతో భూకంప ప్రభావిత ప్రాంతాలను అక్కడి ప్రజలు వీడుతున్నారు. ప్రధానంగా గాజియాంటెప్, హతాయ్, నూర్దగి, మరాష్ నుంచి వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ దేశ విమానయాన సంస్థలు ఉచిత టికెట్లు ఆఫర్ చేస్తున్నాయి. భూకంప బాధితులను తమ విమానాల్లో ఫ్రీగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందుకు వచ్చాయి. తుర్కియెన్ ఎయిర్‌లైన్స్, పెగాసస్ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆదివారం ఈ మేరకు ప్రకటించాయి.
భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి ఇస్తాంబుల్, అంకారా, అంటాల్య వంటి ఇతర సురక్షిత ప్రాంతాలకు ఉచిత టికెట్లను ఆఫర్ చేశాయి. కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్ల విద్యార్థులు, హోటళ్లు, టూరిస్ట్ రిసార్ట్‌లలో బస చేసిన వారు, ఇతర బాధితులను సురక్షిత ప్రాంతాలకు ఉచితంగా తీసుకెళ్తామని వెల్లడించాయి. దీంతో గాజియాంటెప్ విమానాశ్రయానికి వేలాది మంది భూకంప బాధితులు పోటెత్తారు.
మృతుల సంఖ్య 50 వేలకు చేరుకొనే అవకాశం
మరోవైపు తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 30,000కు చేరుకుంది. మృతుల సంఖ్య 50 వేలకు చేరుకునే అవకాశముందని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే మృతుల సంఖ్య రోజు రోజుకీ భారీగా పెరుగుతోంది. శిథిలాలు తవ్వేకొద్ది వేల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.
ఇప్పటివరకు టర్కీలో 24,617 మంది, సిరియాలో 4500 మంది మరణించినట్లు స్థానిక ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు గత వారం రోజులుగా నిరంతరం శ్రమిస్తున్నారు. భూకంపం సంభవించి వారం రోజులు అవుతున్నప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు