అమెరికా గగనతలంపై మరో గుర్తుతెలియని వస్తువు కనిపించగా యుద్ధ విమానాలతో అధికారులు కూల్చేశారు. వారం రోజుల్లో ఇది వరుసగా నాలుగో ఘటన. తొలుత కూల్చేసిన స్పై బెలూన్ పై కొంత స్పష్టత ఉన్నప్పటికీ ఆ తర్వాత జరిపిన కూల్చివేతలపై అధికారవర్గాల్లోస్పష్టత కరవయింది. కూల్చేసినవి వస్తువులా? వాహనాలా? అనేదీ కూడా తేల్చిచెప్పే పరిస్థితి లేదు.
అమెరికా వైమానిక క్షేత్రంలో కనిపిస్తున్న ఆ ఆబ్జెక్ట్స్ ఏలియన్స్ అయి ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వాహనాలు గ్రహాంతరవాసులవే అనేందుకు స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, ఈ ఏలియన్స్ థియరీని కొట్టిపారేయలేమని నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (నొరాడ్) హెడ్ వాన్ హెర్క్ చెప్పారు. ఉత్తర అమెరికా వైమానిక దళానికి చీఫ్గా ఉన్న ఆయన ఓ ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు.
ఆదివారం లేక్ హూరన్ సమీపంలో ఆకాశంలో ఎగురుతున్న అష్టభుజి ఆకారంలోని వస్తువును మిలటరీ జెట్లు కూల్చేశాయి. చైనా స్పై బెలూన్ కూల్చివేత కాకుండా ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడో కూల్చివేత ఇది. ఈ మూడు ఘటనలలో కూల్చేసిన అనుమానిత వస్తువు ఏంటనేది అధికారులకు అంతుచిక్కడంలేదు. వాటిని ఎవరు పంపించారనే విషయంలోనూ ఎలాంటి క్లూ దొరకలేదని, విచారణ జరుపుతున్నామని వివరించారు.
వరుస ఘటనల నేపథ్యంలో అమెరికాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతరిక్షంలోని ఇతర గ్రహాల నుంచి వచ్చిన వాహనాలంటూ ప్రచారం జరుగుతుండగా, నొరాడ్ హెడ్ వాన్ హెరిక్ వ్యాఖ్యలు దానికి ఊతమిచ్చేలా ఉన్నాయి.
మరోవైపు, కూల్చేసిన వాహనాలు, వస్తువులకు సంబంధించిన శకలాలను సేకరించి, వాటిని విశ్లేషించే పనిలో ఇంటలిజెన్స్ అధికారులు బిజీగా ఉన్నారు. ఈ తతంగం పూర్తయితే అమెరికా గగనతలంపై ఎగిరిన అనుమానిత వస్తువులు ఏంటనేదానిపై స్పష్టత వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

More Stories
కెనడాలో భారతీయ విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
నైజీరియాలో ఐఎస్ఐఎస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు
ఎట్టకేలకు మయన్మార్ లో ఆదివారం నుండి ఎన్నికలు